మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు!

20-11-2026 | 07:01am

సిద్దిపేటలో రేవంత్ వ్యాఖ్యలు.. హరీశ్ రావు ఫైర్!

హైదరాబాద్: సిద్దిపేట పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధానికి తెరలేపాయి. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని లక్ష్యంగా చేసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీశ్ రావు(Harish Rao) సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గంటకు పైగా సాగిన ప్రసంగంలో ప్రజా సమస్యల ప్రస్తావన కంటే వ్యక్తిగత విమర్శలు, రాజకీయ ప్రగల్భాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు.

రైతుల సమస్యలు ఎక్కడ.. హరీశ్ ప్రశ్నలు!

సీఎం ప్రసంగంలో కరువు కోరల్లో చిక్కుకున్న రైతులకు ఎలాంటి భరోసా కనిపించలేదని హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేటకు సంబంధించిన రూ.1,070 కోట్ల పెండింగ్ పనులపై కనీస ప్రస్తావన లేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం గురించి కూడా మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలు, Body Shamingకు దిగడం ముఖ్యమంత్రి స్థాయికి తగదని మండిపడ్డారు.

తాడిచెట్టుపై వ్యాఖ్యలు.. క్షమాపణకు డిమాండ్

తాడిచెట్టు, గడ్డం వంటి అంశాలను ప్రస్తావిస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. గౌడ సామాజిక వర్గానికి తాడిచెట్టు కల్పతరువని, అలాంటి చెట్టును పదేపదే అవమానించడం తగదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాడిచెట్టుకు ఉండే బలాన్ని వివరిస్తూ, కష్టకాలంలోనూ నిలబడే దాని లక్షణాలను రాజకీయాలకు అన్వయిస్తూ కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ పథకాలపై లెక్కలతో అటాక్

కేసీఆర్ హయాంలో ప్రారంభించిన పథకాలేవీ రద్దు చేయలేదన్న రేవంత్ వ్యాఖ్యలను హరీశ్ రావు తప్పుబట్టారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మి, ఫీజు రీయింబర్స్‌మెంట్, దళిత బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్, మన ఊరు మన బడి, కంటి వెలుగు వంటి పథకాలను ప్రస్తావించారు. వీటిలో అనేక పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. ఈ విషయంలో సీఎం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదని విమర్శించారు.

కేసీఆర్ సేవలను గుర్తుచేస్తూ..

దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి క్యాన్సర్‌తో బాధపడిన సమయంలో కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని అమెరికాలో చికిత్స అందించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని హరీశ్ రావు గుర్తుచేశారు. కేసీఆర్ మానవతా దృక్పథాన్ని ప్రస్తావిస్తూ, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు. అంతేకాకుండా సిద్దిపేటలో గత ప్రభుత్వం నిర్మించిన అభివృద్ధి పనులకు రిబ్బన్లు కత్తిరించడం, ఇప్పటికే ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలకు పేర్లు పెట్టడం తప్ప కొత్తగా సాధించిందేమిటని ప్రశ్నించారు. మొత్తంగా రేవంత్ ప్రసంగంలో ప్రజా ఎజెండా కనిపించలేదని, మాటల్లో బలం, చేతల్లో అభివృద్ధి దిశ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు చేసిన ఈ X పోస్ట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వార్తలు