అర్హులందరికీ చేయూత పెన్షన్లు
- ప్రజలకు తాగు, సాగునీటిని అందిస్తాం
- జీవనోపాధికి నీటి హక్కులను పరిరక్షిస్తాం
- మేడిగడ్డ, అన్నారం బరాజ్‌ల మరమ్మతు చేపడుతాం
- నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- హుజూర్‌నగర్‌లో చేయూత పెన్షన్లు పంపిణీ
సూర్యాపేట, నవంబర్ 19 (విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పెన్షన్లు అందజేస్తామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy) తెలిపారు. గురువారం హుజూర్‌నగర్‌లో ఆ నియోజకవర్గ పరిధిలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్లు, ముఖ్యమంత్రి సహాయనిధి, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలకు, రైతులకు తాగునీటిని, సాగునీటిని అందిస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనోపాధికి నీటి హక్కులను పరిరక్షిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా- మేడిగడ్డ, అన్నారం బరాజ్‌ల మరమ్మతు చేపట్టి, నీటి వనరులుగా వినియోగిస్తామని చెప్పారు.
చేయూత పింఛన్ల పథకం కింద అర్హులైన వృద్ధులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, కల్లు గీతకార్మికులకు, ఒంటరి మహిళలకు, బీడికార్మికులకు, హెచ్ఐవి పైలేరియా, డయాలసిస్ మొదలగు వారికి నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో మొత్తం 43,113 మంది లబ్ధిదారులకు నెలకు రూ.11.13 కోట్ల చొప్పున ఏటా రూ.133.56 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. సూర్యాపేట జిల్లాలో పాత పింఛన్లు 1,41,256 లబ్ధిదారులకు నెలకు రూ.35.74 కోట్లు అందజేస్తుండగా కొత్త పింఛన్లు 18,573 లబ్ధిదారులకు నెలకు రూ.4.49 కోట్లు చెల్లిస్తున్నట్టు వెల్లడించారు.
ప్రస్తుతం జిల్లాలో మొత్తం 1,59,829 మంది లబ్ధిదారులక నెలకు రూ.40.23 కోట్ల చొప్పున, ఏటా రూ.482.76 కోట్లు చెల్లిస్తున్నట్టు వెల్లడించారు. అర్హత ఉండి పింఛన్లు రాకపోతే మరల దరఖాస్తు చేసుకుంటే పింఛన్ మంజూరు చేస్తామన్నారు. హుజూర్ నగర్ రామస్వామి గుట్ట వద్ద 2,160 సింగిల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినదని ఇప్పటికే 1500 మంది లబ్ధిదారులను గుర్తించి వారిని అర్హులుగా చేర్చామని చెప్పారు. మిగిలిన వారు ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉంటే ఇండ్లు కేటాయిస్తామని తెలిపారు. డిసెంబర్ రెండో వారంలో లబ్ధిదారులకు పట్టాలు అందజేసి ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, దివ్యాంగుల కమిషన్ చైర్మన్ ముత్తి వీరయ్య, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక అరుణ్ దేశ్ ముఖ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, హుజూర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, డి ఆర్ డి ఓ పి డి సన్యాసయ్య పాల్గొన్నారు. కాగా హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌసింగ్ కాలనీని మంత్రి ఉత్తమ్ పరిశీలించారు.