అమ్మో అక్టోబర్ 29!

28-10-2026 | 05:05am
  1. గత ఏడాది ఇదే రోజు కుంభవృష్టి 
  2. వరి పంటపై అన్నదాతల దిగులు 
  3. రైల్వే శాఖ అప్రమత్తం 

మహబూబాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): అమ్మో అక్టోబర్ 29.. గత ఏడాది గుర్తు చేసుకుంటూనే జనం పడలిపోతున్నారు. సరిగ్గా ఏడాది క్రితం అక్టోబర్ 29న ఉదయం ప్రారంభమైన కుంభవృష్టి తో ఉమ్మడి వరంగల్ జిల్లా(Warangal District) ప్రజలు అతలాకుతలమయ్యారు. డోర్నకల్(Dornakal) వద్ద ఏకంగా రైలు పట్టాలపై వరద నీరు వచ్చి చేరడంతో విజయవాడ కాజీపేట రైల్వే(Vijayawada-Kazipet Railway) మార్గంలో(Kazipet Railway Route) రైళ్ల రాకపోకలు రోజంతా నిలిచిపోయాయి. రికార్డు స్థాయిలో భారీ వర్షం కురవడంతో అక్టోబర్ 29 2026న వరంగల్ జన జీవనం అస్తవ్యస్తంగా మారింది.

ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా వరద నీరే కనిపించింది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర రూపం దాల్చడంతో అర్ణబ్ తుఫాను కారణంగా మళ్లీ భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జనం మళ్ళీ నాటి రోజులను గుర్తు చేసుకొని భయాందోళన చెందుతున్నారు. వేసిన వరి పంటలు ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో దిగుబడి పూర్తిగా తగ్గిపోయి, చేతికందే కొద్దిపాటి పంట తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైల్వే శాఖ అప్రమత్తం

అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమయింది. అక్టోబర్ 28, 29న ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో సిబ్బందిని అలెర్ట్ చేసింది. రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. కాజీపేట ,డోర్నకల్ జంక్షన్లలో సహాయ బృందాలను సిద్ధంగా ఉంచారు. వర్షాలు కురిస్తే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగితే రైళ్ల సమాచారం కోసం 139 ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు తెలపడానికి చర్యలు చేపట్టారు. 

వరికి తీవ్ర నష్టమే.!

వరి పంట చేతికందే దశలో ఉంది. రేపో మాపో కోతలకు సన్నద్దమవుతున్నాం. ఇప్పుడు తుఫాన్ అంటు న్నారు. నోటి కాడి బుక్క వాన పాలయ్యే పరిస్థితి నెలకొంది. ఎల్ నినో తో పంట దిగుబడి బాగా తగ్గింది. కొద్ది పాటి పంటను తుఫాన్ ఏం చేస్తుందో.. తెలువక నిద్రపట్టడం లేదు. 

మంచాల చిన్న మల్లయ్య, 

కౌలు రైతు, ఉప్పరపల్లి 

మహబూబాబాద్ జిల్లా

మరిన్ని వార్తలు