మానుకోట.. @ గుడుంబా!

23-11-2026 | 05:10am

నివ్వెర పోతున్న పోలీసులు 

మహబూబాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): ఒకప్పుడు దట్టమైన ‘మాను’లతో నిండి మానుకోటగా గుర్తింపు పొందిన మహబూబాబాద్ జిల్లా ఇప్పుడు గుడుంబాకు కేరాఫ్ అడ్రస్ గా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  పోలీసులు(Police), ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు(Enforcement officials) గుడుంబా నియంత్రణకు ఎంత ప్రయత్నిస్తున్నా మానుకోటలో సంపూర్ణ కుటుంబ రహిత జిల్లాగా మార్చడం వారి వల్ల కావడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి.

ఒకటి రెండు ప్రాంతాలకే పరిమితమై ఉంటుందనుకున్న గుడుంబా తయారీ.. అనేక గ్రామాలకు విస్తరించి కుటీర పరిశ్రమను తలపించేలా కొనసాగుతుండటం అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. కొద్దిరోజులుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసుల దాడుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా గుడుంబా గుట్టు బయటపడుతోంది. గుడుంబా తయారీకి అవసరమైన ముడిసరుకును సమకూర్చుకోవడం, రహస్య ప్రదేశాల్లో బట్టీలు ఏర్పాటు చేయడం,

తయారైన మద్యాన్ని చిన్నచిన్న పరిమాణాల్లో విక్రయించడం వంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు తనిఖీల్లో బయటపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని నిర్మానుష్య ప్రదేశాలు, వ్యవసాయ బావుల పరిసరాలు, వాగులు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలు తయారీ కేంద్రాలుగా మారుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత విస్తృతంగా తయారీ సాగుతుంటే ముడిసరుకు సరఫరా, రవాణా, విక్రయాల వెనుక ఉన్న నెట్వర్క్పై పూర్తిస్థాయిలో నిఘా ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆరోగ్యానికి విషం.. కుటుంబాలకు శాపం!

నిబంధనలకు విరుద్ధంగా తయారయ్యే గుడుంబా ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. నాణ్యతా ప్రమాణాలు, తయారీ నియంత్రణలు లేకుండా విక్రయించే కల్తీ మద్యం సేవించడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పేద, కూలీ కుటుంబాలు ఈ వ్యసనానికి బలై ఆర్థికంగా చితికిపోతున్నాయనే ఆవేదన వ్యక్తమవుతోంది. సంపాదనలో గణనీయమైన భాగం మద్యానికే ఖర్చవుతుండటంతో కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

మూలాలపై దృష్టి పెడితేనే అడ్డుకట్ట!

గుడుంబా తయారీ కేంద్రాలపై దాడులు చేయడం ఒక్కటే పరిష్కారం కాదని, ముడిసరుకు సరఫరాదారులు, రవాణాదారులు, విక్రయదారులు, ప్రధాన నిర్వాహకుల వరకు దర్యాప్తు విస్తరించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పట్టుబడిన వారిపైనే కాకుండా వారి వెనుక ఉన్న వ్యవస్థను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో గుడుంబా తయారీ, విక్రయాలపై ఆధారపడిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం, వ్యసన విముక్తి కార్యక్రమాలను గ్రామస్థాయిలో విస్తరించడం అవసరం.

గుడుంబా బట్టీలు పూర్తిగా ఆరిపోయి, గ్రామాల్లో మద్యం మహమ్మారి తగ్గినప్పుడే సంపూర్ణ మద్యనిషేధ లక్ష్యం దిశగా అడుగులు పడినట్లవుతుంది. దాడుల హడావుడితో సరిపెట్టకుండా.. గుడుంబా తయారీ మూలాలను పెకిలించే కార్యాచరణ ఎప్పుడు మొదలవుతుందోనని ప్రజలు నిరీక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు