కాంగ్రెస్‌లోనే ఉంటా
- పార్టీ మారే ఆలోచనే లేదు..
- తూర్పు టికెట్ మళ్లీ నాకే.. విజయం నాదే
- మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినందుకు బాధలేదు
- మాజీ మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులు
మహబూబాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ‘మంత్రి పదవి నుంచి బర్తరఫ్ (Bartaruf) చేసినందుకు మేం బాధపడడం లేదు. మంత్రి పదవి (Ministerial position) ఉన్నంతకాలం ఏ చిన్న తప్పు కూడా చేయలేదు. మాకు పార్టీ మారే ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీలోనే (Congress Party) కొనసాగుతాం. వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు టికెట్ నాకే వస్తుంది. గెలుపు కూడా నాదే. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం.
మున్సిపల్ ఎన్నికల్లో నవీన్ రాజ్ ఆధ్వర్యంలో 24 కార్పొరేటర్ స్థానా ల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తాం’ అని మాజీమంత్రి కొండా సురేఖ, మురళి దంపతులు స్పష్టం చేశారు. ఆదివారం వరంగల్ నగరంలో తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో వారు సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇక నుంచి ఎవరైనా తమ గురించి మాట్లాడాలనుకుంటే ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.
తమకు అధిష్ఠానం నుంచి ఎటు వెళ్లొద్దని ఫోన్లు వస్తున్నాయని, తాము పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ తనకే కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని, ఎన్నికల్లో గెలవడంతో పాటు మళ్లీ మంత్రిని అవుతానని కొండా సురేఖ స్పష్టం చేశారు. మైకు చూడక చాలా రోజులైందని, అలాంటివారు ఏది పడితే అది మాట్లాడుతూ ఊగిపోతున్నారని, దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని పరోక్షంగా ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిపై వ్యాఖ్యానించారు.
భద్రకాళి ఆలయ కమిటీ విషయంలో హంగామా చేసిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి పదవి తొలగిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పశ్చిమ వరంగల్ నియోజకవర్గంలో నాడు వినయ్‌భాస్కర్‌ను తట్టుకోలేక మమ్మల్ని బతిమాలి తీసుకెళ్లేవాడని ఎద్దేవా చేశారు. స్థానిక డివిజన్‌లో కార్పొరేటర్‌ను గెలిపించుకునే స్థాయి కూడా బస్వరాజ్ సారయ్యకు లేదని విమర్శించారు.
పది రోజుల నుంచి కార్యకర్తలు ఎంతో బాధపడుతున్నారని, సుమంత్ బెయిల్ కోసం కార్యకర్తలను కలవడం ఆలస్యం అయిందన్నారు. ఇప్పుడు న్న నాయకులు పొద్దున ఒక పార్టీలో, మధ్యాహ్నం ఒక పార్టీలో తిరుగుతున్నారన్నారు. తాను ఎప్పుడు పదవుల కోసం ఆరాటపడలేదని, వైఎస్సార్ చనిపోయాక ఇక్కడున్న గుంట నక్కలు తమను మోసం చేశాయన్నారు. కేసీఆర్ సూచనతో వరంగల్ తూర్పు వరంగల్ నియోజకవర్గంలో పోటీ చేసి అప్పటి మంత్రిని 55 వేల మెజారిటీతో ఓడించానని గుర్తుచేశారు.
పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అక్రమంగా సంపాదించాడని, తాను చిన్న తప్పు కానీ చిన్న మచ్చ లేకుండా మూడు శాఖలను సమర్ధవత్తంగా నిర్వహించానని పేర్కొన్నారు. పదవి అనేది అలంకారం మాత్రమే పని చేయాలనుకుంటే పదవి అక్కర్లేదని స్పష్టం చేశారు.
అనివార్య కారణాలవల్ల బీఆర్‌ఎస్ పార్టీలోకి పోయాము కానీ ఎవరు ఆ పార్టీ నుంచి వెళ్లగొట్టలేదన్నారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, సారీ చెప్పాల్సిన పరిస్థితి తమకు లేదన్నారు. సురేఖ, మురళిది ఒకే మాట, ఒకే బాట అంటూ స్పష్టం చేశారు.