బ్రిక్స్ వికసించాలి
- సమ్మిళిత వృద్ధి వర్ధిల్లాలి
- సాంకేతికత, కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చొద్దు
- ఇది ఉమ్మడి పురోగతికి, శ్రేయస్సుకు ఆటంకం
- 18వ బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: సాంకేతికత, కీలక ఖనిజాలను ‘ఆయుధాలుగా’ మార్చ డం ఉమ్మడి శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) హెచ్చరించారు. బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారంతో ఎదగాలని, గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న తీవ్ర సవాళ్లను పరిష్కరించాలని, మానవాళి కోసం వర్ధిల్లాలని పిలుపునిచ్చారు. సహకారం, సమ్మిళిత వృద్ధిగా ‘బ్రిక్స్’వికసించాలని పేర్కొన్నారు.
భారత్ ఆతిథ్యంలో ఢిల్లీలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమా వేశం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ.. ప్రపంచ సంఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జీవితాలపై వాటి ప్రభావాన్ని తగ్గించడానికి కూటమి కలిసి పనిచేయాలని కోరారు. గ్లోబల్ సౌత్‌లో అభివృద్ధి చెందుతున్న దేశాలు బ్రిక్స్‌ను ఎక్కువగా విశ్వసిస్తున్నాయన్నారు.
ఎందుకంటే వారి గొంతుక వినబడుతుందని, వారి అనుభవాలకు విలువ ఇవ్వబడుతుందని, పరిష్కారాలు వారిపై రుద్దకుండా, వారితో భాగస్వామ్యంతో రూపొందించబడతాయని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై లోతుగా చర్చిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో తాము సమ్మిళితత్వానికి ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. కీలక ఖనిజాల ఎగుమతిపై చైనా ఆంక్షలు, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి ఆ దేశ విముఖతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరిం చుకున్నాయి.
‘మనం వేర్వేరు వాస్తవాల్లో పాతుకుపోయి ఉండవచ్చు, కానీ కలిసికట్టుగా పరస్పర సహకారంతో ఎదిగి, మానవాళి కోసం వికసిస్తాం. మన వైవిధ్యమే గుర్తింపుగా, సహకారమే స్ఫూర్తిగా, మన పురోగతి సకల మానవాళికి సేవగా నిలవాలి’ అన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌లోతో సహా ఈ కూటమిలోని అగ్రనాయ కులసమక్షంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
బ్రిక్స్ దేశాల స్థితిస్థాపకత చాలా కీలకం..
అస్థిరమైన భౌగోళిక రాజకీయ వాతావరణాన్ని ఎదుర్కోవడానికి బ్రిక్స్ దేశాల స్థితిస్థాపకతను పెంచడం ఎంత ముఖ్యమో ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అలాగే, ఈ కూటమికి న్యూఢిల్లీ అధ్యక్షత వహించడం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారంతోపాటు సుస్థిరత అనే నాలుగు స్తంభాలపై దృష్టి సారించిందని తెలిపారు. ఈ నాలుగు స్తంభాల ఆధారంగా, బ్రిక్స్ ద్వారా భారతదేశం సమ్మిళిత ప్రపంచ వృద్ధిని ప్రోత్స హించాలని కోరుకుంటోందన్నారు.
ఎందుకంటే, ఈ కూటమిలో అభివృద్ధి చేసిన పరిష్కారాల ప్రయోజనాలు కేవలం దీనికే పరిమితం కాకూడదన్నారు. వాటిని గ్లోబల్ సౌత్ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని భారత దేశం విశ్వసిస్తోందని తెలిపారు. ‘మీ అందరి సహకారం, మద్దతుతో మన ఉమ్మడి దార్శనికతను పరస్పర ప్రయోజనకరమైన సహకారంగా మార్చగలిగినందుకు నేను సంతోషిస్తున్నా’ అని ఆయన అన్నారు.
నేడు ప్రపంచంలో సంఘర్షణలు, ఉద్రిక్తతల సంఖ్య నిరంతరం పెరుగుతోందని, ఇది సామాన్య ప్రజల జీవితాలపై ప్రతికూల, సుదూర ప్రభావాలను చూపుతోందని చెప్పారు. ‘మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సరఫరా గొలుసు అంతరాయాలు వంటివి నేటి పరస్పర అనుసంధాన ప్రపంచంలో ఏ సంక్షోభం కూడా ఒకే ప్రాంతానికి పరిమితం కాదని నిరూపించాయి.
అందువల్ల, బ్రిక్స్ కూటమిలో భారత్ స్థితిస్థాపకతను బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని అన్నారు. సవాళ్ల ను సకాలంలో గుర్తించడం, వాటికి సిద్ధంగా ఉండటం, తక్షణచర్యలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం అని మోదీ వాదించారు.
బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్..
ఆవిష్కరణల విభాగంలో, బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్‌వర్క్ మన స్టార్టప్లను, ఇంక్యుబేట ర్లను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తుంది. వినూత్న మైన, విస్తరించదగిన పరిష్కారాలను ప్రోత్సహించడానికి బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్‌ను భారత్ ప్రతిపాదించిందన్నారు. డిజిటల్ వ్యవ సాయంపై బ్రిక్స్ నెట్‌వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని, ఎందుకంటే ఈ చొరవ ద్వారా ఏఐ, జియోస్పేషియల్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లను రైతుల అవసరాలకు అనుసంధానిస్తారని తెలిపారు.
బ్రిక్స్ దేశాల మధ్య ఉత్తమ పద్ధతులను పంచుకోవడాన్ని సులభతరం చేయడానికి బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు మోదీ చెప్పారు. భారత నాగరికతలో ప్రకృతికి తల్లి హోదా ఇవ్వబడిందని ప్రధాని అన్నారు.
శతాబ్దాలుగా, అభివృద్ధి, పర్యావరణం ఒకదానికొకటి ప్రత్యా మ్నాయాలు కాదని, అవి పరస్పర పూరకాలని తాము విశ్వసిస్తున్నామని వెల్లడించారు. ‘బ్రిక్స్ కూటమిలో కూడా, మానవ అభివృ ద్ధికి, పర్యావరణానికి మధ్య సమతుల్యత సాధించాల్సిన అవసరాన్ని మోదీ స్పష్టం చేశారు. ఇదే సుస్థిరతకు పునాది. ఇది భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత కూడా అన్నారు.
మోదీ 15 ద్వైపాక్షిక సమావేశాలు..
బ్రిక్స్ సదస్సు సందర్భంగా గత మూడు రోజుల్లో ప్రధాని మోదీ వివిధ దేశాల అధ్యక్షులు, ప్రభుత్వ అధినేతలతో 15 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ప్రపంచ జనాభాలో 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో 40 శాతానికి ప్రాతినిథ్యం వహిస్తున్న 11 ప్రధాన వర్ధమాన ఆర్థిక వ్యవస్థల కూటమి అయిన బ్రిక్స్ వార్షిక శిఖరాగ్ర సమావేశం, లాజిస్టిక్స్ సరఫరా గొలుసులు, స్టార్టప్‌లు, అంటు వ్యాధుల నియంత్రణ వంటి రంగాలలో కీలక ఫలితాలతో ఆదివారం ముగిసింది.