కష్టాల ప్రయాణం..!

28-11-2026 | 05:15am

బస్టాపుల్లో కనీస వసతులు కరువు.. 

ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ అవస్థలు

కేసముద్రం, నవంబర్ 27 (విజయక్రాంతి): పట్టణంగా రూపాంతరం చెంది మున్సిపాలిటీ హోదా పొందిన కేసముద్రం(Kesamudram)లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు మాత్రం ఆశించిన స్థాయిలో అందుబాటులోకి రావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్తో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న బస్స్టాపుల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండే ప్రయాణికులకు కూర్చునేందుకు బెంచీలు, ఎండా వానల నుంచి రక్షణ కల్పించే షెడ్లు, తాగునీరు, పరిశుభ్రమైన పరిసరాలు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.

ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు, దివ్యాంగులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. బస్టాండ్ శిధిలంగా మారడంతో కొత్తది నిర్మించడానికి చర్యలు చేపట్టారు. దీనితో ఆర్టీసీ బస్సులు బస్టాండులోకి వెళ్లడం లేదు. కేసముద్రం పట్టణంలోని కూడళ్లలో ఆర్టీసీ బస్సుల కోసం నిరీక్షించే ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద ఉన్న బస్స్టాపుల్లో అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. నిలువ నీడ లేకపోవడంతో ప్రయాణికులు దుకాణాల ముందు, రోడ్డు పక్కన నిలబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.

వేసవిలో ఎండ తీవ్రతకు అల్లాడుతూ, వర్షాకాలంలో తడుస్తూ ప్రయాణాలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. మున్సిపాలిటీగా అభివృద్ధి చెందు తున్న కేసముద్రంలో రహదారులు, భవనా లు, ఇతర అభివృద్ధి పనులతో పాటు ప్రజా రవాణా సౌకర్యాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ అధికారులు, మున్సిపల్ పాలకవర్గం సమన్వ యంతో బస్టాండ్ను ఆధునికీకరించడంతో పాటు పట్టణంలోని ప్రధాన బస్స్టాపుల వద్ద అవసరమైన షెడ్లు, సీటింగ్, తాగునీరు, లైటింగ్, మరుగుదొడ్ల వంటి సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలి..

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో రైల్వే స్టేషన్, మోహన్ టాకీస్, పొట్టి శ్రీరాములు సర్కిల్, మహాత్మ జ్యోతిబాపూలే, అంబేద్కర్ సెంటర్, ఎన్టీఆర్ విగ్రహం సర్కిల్, పోలీస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలి. బస్సు షెల్టర్ల వద్ద ప్రయాణికులకు అవసరమైన వసతులు కల్పించాలి. కేసముద్రం పట్టణంలో పాత బస్టాండ్ స్థానంలో కొత్త బస్టాండ్ నిర్మించే వరకు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. బస్ షెల్టర్ ల వద్ద ప్రయాణికులు కూర్చోవడానికి వీలుగా సౌకర్యాలు వెంటనే కల్పించాలి.

 గంధం సతీష్, ప్రయాణికుడు

మరిన్ని వార్తలు