నీటిపై తేలియాడుతూ ప్రపంచ పటం గీసిన చింతకుంట్ల కుమారస్వామి

29-11-2026 | 03:44pm

ప్రపంచంలోనే తొలిసారిగా 5 నిమిషాల 24 సెకన్లలో అరుదైన రికార్డు

మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణానికి చెందిన కాళోజి వాకర్స్ అసోసియేషన్(Kaloji Walkers Association) సభ్యుడు చింతకుంట్ల కుమారస్వామి అసాధారణ ప్రతిభను కనబరిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(మిల్ట్రీ బావి) వద్ద కాళోజి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నీటిపై తేలియాడుతూ ప్రపంచ పటాన్ని చిత్రీకరించి చరిత్ర సృష్టించారు. కేవలం 5 నిమిషాల 24 సెకన్ల వ్యవధిలోనే నీటిలో ఉండి, ఆయా ఖండాల పేర్లతో సహా అత్యంత కచ్చితత్వంతో ప్రపంచ పటాన్ని గీయడం విశేషం.

ప్రపంచంలోనే ఇలా నీటిపై తేలియాడుతూ ప్రపంచ పటాన్ని గీయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కుమారస్వామి  అద్భుత కళా నైపుణ్యాన్ని, అసాధారణ సంకల్పాన్ని చూసి స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ అరుదైన ఘట్టాన్ని వీక్షించేందుకు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ కుమారస్వామి ప్రదర్శనను ఆద్యంతం ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం కుమారస్వామిని ప్రత్యేకంగా అభినందిస్తూ.. ఇటువంటి అరుదైన ప్రతిభావంతులు మన ప్రాంతంలో ఉండటం ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ జ్యోతి రమేష్, కాళోజి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డోలి సత్యనారాయణ, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కుమారస్వామిని సత్కరించారు.

మరిన్ని వార్తలు