అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
మహబూబాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాలు ఎప్పటికీ మరువలేనివని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. వారి ఆశయాల సాధనే పార్టీ శ్రేణుల బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన దీక్షా దివస్ (Deeksha Diwas) కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. పలు రంగాల్లో రాష్ట్రం అగ్రస్థానానికి చేరుకుందని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, ప్రగతి (Development) కుంటుపడుతున్నాయని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా కృషి చేసి తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ అంగోత్ బిందు, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్ మోహన్ రెడ్డి, నాయకులు బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, యాళ్ల మురళీధర్ రెడ్డి, మార్నేని వెంకన్న, ముత్యం వెంకన్న గౌడ్, తేళ్ల శ్రీనివాస్, మహబూబ్ పాషా, అశోక్ నాయక్, ఫరీద్, నజీర్ అహ్మద్, వెంకట కృష్ణారెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.