తక్కువ ధరకు ప్లాట్లంటూ కోటి రూపాయలకు పైగా టోకరా

29-11-2026 | 03:14pm

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): తక్కువ ధరకే ప్లాట్లు ఇప్పిస్తామంటూ నమ్మించి సామాన్యుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ఓ వ్యక్తి మోసానికి పాల్పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, సామాన్యులకు మధ్యవర్తిగా వ్యవహరించే ఓ వ్యక్తి తనకే సొంతంగా వెంచర్ (Venture) ఉందంటూ పరిచయస్తులను నమ్మించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకే ప్లాట్లు (Plots) ఇప్పిస్తానని చెప్పి పలువురి నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసినట్లు తెలిపారు.

తీరా చూస్తే అతడి వద్ద అసలు ప్లాట్లే లేవని గుర్తించి మోసపోయినట్లు బాధితులు వాపోయారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు (Complaint) చేసినా స్పందన లేదని ఆరోపిస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలోని సదరు వ్యక్తి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ వ్యవహారంలో 50 మందికి పైగా బాధితులు ఉండగా, కోటి రూపాయలకు పైగా నగదు మోసపోయినట్లు వెల్లడించారు. బాధితులు నిరసనకు దిగడంతో విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయడంతో పాటు మోసపోయిన డబ్బులను తిరిగి ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు