బిగ్ ఫైట్‌కు తెరలేపిన PWL

29-11-2026 | 02:52pm

ముంబై: ప్రో రెజ్లింగ్ లీగ్(Pro Wrestling League) ఆరో సీజన్‌కు రంగం సిద్ధమైంది. స్టార్ రెజ్లర్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు భారీ వ్యూహాలతో వేలం బరిలోకి దిగనున్నాయి. నవంబర్ 30న ముంబైలో జరగనున్న ఈ వేలంలో మొత్తం 24 దేశాలకు చెందిన 209 మంది రెజ్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా నాలుగు జట్లు గత సీజన్ ఆటగాళ్లలో ఒక్కరినీ రిటైన్ చేసుకోకుండా కొత్త జట్టును నిర్మించుకోవాలని నిర్ణయించడం ఆసక్తి రేపుతోంది.

అమన్ సెహ్రావత్‌కు ముంబై జట్టు మద్దతు

ఆరో సీజన్‌కు ముందు ముంబై దంగల్స్ టైగర్స్ ఒలింపిక్ పతక విజేత అమన్ సెహ్రావత్‌ను తమ జట్టులో కొనసాగించాలని నిర్ణయించింది. పారిస్ ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలో కాంస్యం సాధించిన అమన్‌పై ఈసారి భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఢిల్లీ దంగల్ వారియర్స్ ఇరాన్‌కు చెందిన హదీ వఫాయీపూర్‌ను రిటైన్ చేసుకుంది. మిగిలిన నాలుగు ఫ్రాంచైజీలు మాత్రం కొత్త ఆటగాళ్లతో జట్లను నిర్మించుకునేందుకు సిద్ధమయ్యాయి.

24 దేశాలు.. 209 మంది రెజ్లర్లు

ఈసారి వేలం జాబితాలో 131 మంది భారతీయులు, 78 మంది విదేశీ రెజ్లర్లు ఉన్నారు. వీరిలో 119 మంది పురుషులు, 90 మంది మహిళా రెజ్లర్లు కావడం విశేషం. మొత్తం 22 మంది స్టార్ రెజ్లర్లు A+ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు.

వేలంలో ఆటగాళ్ల కనీస ధరలు ఇలా ఉన్నాయి:

A+ కేటగిరీ: రూ.18 లక్షలు

A కేటగిరీ: రూ.12 లక్షలు

B కేటగిరీ: రూ.8 లక్షలు

C కేటగిరీ: రూ.3 లక్షలు

బరిలో ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్లు

ఈ వేలంలో అంతర్జాతీయ స్థాయి దిగ్గజాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఇరాన్‌కు చెందిన ఒలింపిక్ ఛాంపియన్ హసన్ యజ్దానీ, జపాన్‌కు చెందిన యుయి సుసాకి, అనస్తాసియా నిచితా, డైచి తకటాని వంటి ప్రముఖ రెజ్లర్లు జాబితాలో ఉన్నారు. భారత తరఫున మనీషా భాన్వాలా, సుజీత్ కల్కల్, ఆంటిమ్ పంఘల్, దీపక్ పునియా, నీలం, తను శర్మ, యువ రెజ్లర్ కాజల్ వంటి ప్రతిభావంతులు వేలంలో అందుబాటులో ఉన్నారు.

ప్రతి జట్టుకు రూ.2 కోట్ల బడ్జెట్

ఆరు ఫ్రాంచైజీలకు కలిపి మొత్తం రూ.12 కోట్ల వేలం బడ్జెట్ కేటాయించారు. ఒక్కో జట్టు గరిష్టంగా 12 మంది, కనీసం తొమ్మిది మంది రెజ్లర్లను ఎంపిక చేసుకోవాలి. ప్రతి జట్టులో కనీసం ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉండటం తప్పనిసరి. అలాగే నలుగురు విదేశీ రెజ్లర్లు, ఒక కేటగిరీ C ఆటగాడు ఉండాలి.

గత సీజన్‌లో జపాన్‌కు చెందిన యుయి సుసాకి రూ.60 లక్షల ధరతో లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన రెజ్లర్‌గా నిలిచింది. ఈసారి కూడా స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీల మధ్య భారీ పోటీ జరిగే అవకాశముంది.

జనవరి 3 నుంచి సీజన్ 6 సమరం

వేలం ప్రక్రియ నవంబర్ 30న ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో జరగనుంది. అనంతరం 2027 జనవరి 3 నుంచి 19 వరకు న్యూఢిల్లీలోని కేడీ జాదవ్ రెజ్లింగ్ అరేనాలో ఆరో సీజన్ పోటీలు నిర్వహించనున్నారు.

గత సీజన్ ఫైనల్లో హర్యానా థండర్స్ 5–4తో ఢిల్లీ దంగల్ వారియర్స్‌ను ఓడించి టైటిల్ సాధించింది. ఈసారి కూడా అదే జోరు కొనసాగిస్తుందా? లేక కొత్త ఆటగాళ్లతో మరో జట్టు ఛాంపియన్‌గా అవతరిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు