ఘనంగా వినాయక నిమజ్జనం
మహమ్మదాబాద్:సెప్టెంబర్ 16(విజయక్రాంతి): దేశాయిపల్లి ఎక్స్ రోడ్లోని శ్రీ అక్షర గ్రామర్ స్కూల్(Akshara Grammar School)లో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. బుధవారం పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హారతి అనంతరం గణనాథుని విగ్రహాన్ని శోభాయాత్రగా తీసుకెళ్లి నిమజ్జనం నిర్వహించారు. విద్యార్థులు భక్తిగీతాలు, నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె. ప్రహ్లాద్ రెడ్డి మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలు విద్యార్థుల్లో భక్తి, ఐక్యత, క్రమశిక్షణతో పాటు సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.