బీజేపీ పాదయాత్ర

07-11-2026 | 09:44am

జడ్చర్లలో బీజేపీ పాదయాత్ర - రోడ్డు సమస్యలపై నిరసన

జడ్చర్ల,నవంబర్ 07:  మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల(Jadcherla) మండలంలో రోడ్డు సమస్యలపై భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) పాదయాత్ర చేపట్టింది. కోడుగల్ హనుమాన్ టెంపుల్ నుండి గంగాపూర్ అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగిన ఈ పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, మండల అధ్యక్షుడు యాట రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముచ్చర్ల జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ... స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లయినా మన గ్రామాలకు స్వాతంత్ర్యం రాలేదన్నారు. గంగాపూర్ నుంచి లింగంపేట్, కోడుగల్ గ్రామాలకు రోడ్లు బాగా లేవని, టెండర్ వేసి ఉన్న రోడ్లను తవ్వేసి మట్టి, కంకర వేసి అసంపూర్తిగా వదిలేశారని మండిపడ్డారు.

ప్రస్తుత ఎమ్మెల్యే సోషల్ మీడియాలో హైప్ కోసం హంగామా చేస్తున్నారే తప్ప అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. అభివృద్ధిలో సున్నా అని, మన జిల్లా నుంచే సీఎం ఉన్నా జిల్లా అభివృద్ధి కావడం లేదన్నారు. గతంలో కేసీఆర్(KCR) అభివృద్ధి చేస్తారనుకుంటే వారు జపం చేస్తూ వచ్చారని, అందుకే ప్రజలు బుద్ధి చెప్పారని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ నేతలను విమర్శించడానికే సమయం సరిపోతుందన్నారు. ఇకనైనా విమర్శలు పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పెట్టి దోచుకుంటే, మీరు భూభారతి పెట్టి డబుల్ దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇదే రోడ్డులో లింగంపేట్ మాజీ సర్పంచ్ కృష్ణయ్య గౌడ్ మృతి చెందారని, ఆయన ప్రాణం తీసుకొస్తారా అని నిలదీశారు. చేతకానప్పుడు రోడ్లు తవ్వి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరించారు. మండల అధ్యక్షుడు యాట రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన "నువ్వు డప్పు కొట్టు నేను ఆడుతా" అన్నట్లుగా సాగుతోందని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు