మాట ఇచ్చాం.... నిలబెట్టుకున్నాం
- ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
- అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు, స్మార్ట్ కార్డుల పంపిణీ
భూత్పూర్, అక్టోబర్ 6 : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మాట ఇచ్చామని ...... ఆ మాటను నిలబెట్టుకున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి(Devarakadra MLA G. Madhusudan Reddy) అన్నారు. భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని కేఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా నమోదు చేసుకున్న లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందే విధంగా మా ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ప్రతి పేద కుటుంబం సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారులకు సన్న బియ్యం అందిస్తుందన్నారు.
రెండో విడతలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసామన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూంలు ఇచ్చామని చెప్పుకుంటూ వస్తున్నారని ఎంతమందికి డబుల్ బెడ్రూంలు అందజేశారని చెప్పాలని ఆయన మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ లో ఇచ్చి నిరుపేద లబ్ధిదారుల నుంచి డబ్బులను వసూలు చేశారని, వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ కార్డులను తీసుకువచ్చిందని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా అర్హులైన లబ్ధిదారులు స్మార్ట్ కార్డు ద్వారా బియ్యం తీసుకోవచ్చన్నారు. గత బిఆర్ఎస్ పాలనలో వాగులు, చెరువుల నుంచి మట్టిని తవ్వి డబ్బులను సంపాదించడం తప్ప ప్రజల అభివృద్ధిపై దృష్టి సారించలేదన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతోపాటు, స్మార్ట్ కార్డులు, ఇందిరమ్మ ప్రోసిడింగ్ కాపీలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కీ నవీన్ గౌడ్, తహసిల్దార్ కిషన్, కమిషనర్ పవన్ కుమార్, కౌన్సిలర్లు పద్మ, లాలూ నాయక్, లతా, గడ్డం ప్రేమ్ కుమార్, కో ఆప్షన్ లు పవన్, లావణ్య, అప్రోజ్ తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తతలు పాల్గొన్నారు.