అక్రమ కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- అనుమానం ఉంటే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలి
- కార్డెన్ సెర్చ్ లో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్
గోదావరిఖని, అక్టోబర్ 04(విజయక్రాంతి): అక్రమ కార్యకలాపాల నియంత్రణకు(Control of illegal activities) ప్రజల సహకారం ఎంతో అవసరమని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్(Godavarikhani ACP Madatha Ramesh) అన్నారు. సప్తగిరి కాలనీలో గోదావరిఖని వన్‌టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమాజ సంబంధాల కార్యక్రమంలో ఆయన పాల్గొని కాలనీ వాసులకు పలు సూచనలు చేశారు.
కాలనీలో ఇళ్లను తనిఖీ చేయడంతో పాటు మాదకద్రవ్యాల(Narcotics) గుర్తింపు కుక్కలతో తనిఖీలు నిర్వహించారు. 65 ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, 6 ఆటోలను తనిఖీ చేసి ధ్రువపత్రాలు పరిశీలించగా, సరైన పత్రాలు లేని 15 వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పిల్లల మొబైల్ వినియోగంపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ కలిగి ఉండాలని ఏసీపీ సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాలు లేదా ఇతర అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని, సమాచారదాతల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
అద్దెకు ఇళ్లు ఇచ్చే యజమానులు అద్దెదారుల పూర్తి వివరాలు, గుర్తింపు పత్రాలు పరిశీలించి నమోదు చేసుకోవాలని సూచించారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని ఏసీపీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, కార్పొరేటర్ గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.