ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మహిళల హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక
100 మంది క్రీడాకారిణుల నుంచి 16 మందికి చోటు
మిడ్జిల్, నవంబర్ 23: తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్(Telangana Handball Association) ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మహిళల హ్యాండ్‌బాల్ జట్టు ఎంపికలు ఆదివారం జడ్చర్లలోని బి.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు జిల్లాల నుంచి సుమారు 100 మంది క్రీడాకారిణులు ఈ ఎంపికల్లో పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 16 మందిని జిల్లా మహిళల హ్యాండ్‌బాల్ జట్టు(District women's handball team)కు ఎంపిక చేశారు.
ఎంపికైన క్రీడాకారిణుల్లో రోజా, భవాని, శివాని, హిమబిందు, బిందుప్రియ, అంకిత, మహేశ్వరి, కీర్తి, జీవన, జ్యోత్స్న, అఖిల, భార్గవి, రాణి, కావ్య, రిషిత, నందిని ఉన్నారు. ఎంపికైన జట్టు డిసెంబర్ 4 నుంచి 6 వరకు నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించనున్న 55వ తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లాల మహిళల హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్-2026లో పాల్గొననుంది.
ఈ ఎంపిక కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. శంకర్ నాయక్, ఉపాధ్యక్షులు డాక్టర్ వెంకటేష్, సంయుక్త కార్యదర్శి ఉమాశంకర్‌తో పాటు జాతీయ హ్యాండ్‌బాల్ క్రీడాకారులు అభిలాష్, శివకుమార్, శ్రీను, మహేష్, చరణ్, నిఖీశ్వర్, సీనియర్ క్రీడాకారులు హమీద్ అలీ, కిషన్, సిద్ధు, లాలు, అరవింద్, ఈశ్వర్, హరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ఎంపికైన క్రీడాకారిణులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయికి ఎదిగేలా కృషి చేయాలని, క్రీడాకోటా కింద విద్యా, ఉద్యోగ అవకాశాల్లో లభించే రెండు శాతం రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడలతో శారీరక దారుఢ్యం పెంపొందించుకొని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు.