నిరంతర సాధన, క్రమశిక్షణతోనే లక్ష్యం సాధిస్తాం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): నిరంతర సాధన, క్రమశిక్షణ, పట్టుదల ఎంతో అవసరమని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం కావడం, ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం సంపాదించడం వంటి అంశాల్లో విజయం సాధించాలంటే కనీసం ఏడాది పాటు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. నగరంలోని మెట్టుగడ్డ జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల(59th National Library Week Celebrations) ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, చెస్, డ్రాయింగ్ తదితర పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు తమపై తాము నమ్మకం ఉంచుకుని, నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా నిరంతరం శ్రమించాలని అన్నారు. పాఠశాల స్థాయి నుంచే వివిధ పోటీల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ఇతరులతో పోటీపడే నైపుణ్యం అలవడుతుందని పేర్కొన్నారు.
విద్యార్థులు పదో తరగతిలో మంచి మార్కులు సాధించి, ఇంటర్మీడియట్లో మంచి కళాశాలల్లో చేరడంతోపాటు, భవిష్యత్తులో ఆసక్తి ఉన్న ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేలా ఇప్పటి నుంచే కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, మైత్రి యాదయ్య, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, నాయకులు గోవింద్ యాదవ్, కార్పొరేటర్లు తిరుమల వెంకటేష్, మేఘ్యానాయక్, రమేష్ రెడ్డి గ్రంధాలయ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.