రీ సర్వే పనులను ఖచ్చితత్వంతో, పూర్తి చేయాలి
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కొనసాగుతున్న రీ సర్వే పనులను(Re-survey work) ఖచ్చితత్వంతో, శర వేగంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. గురువారం బెల్లంపల్లి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని(Tahsildar Office) సందర్శించి జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో పాల్గొని కార్యాలయ సిబ్బందితో కలిసి రాజ్యాంగ పీఠికను ప్రకటించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో వివిధ రెవెన్యూ అంశాలు, ప్రభుత్వ పథకాల అమలు, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వే నూతన ఎస్ఓపి అమలు, హైకోర్టు కేసులకు సంబంధించి సి.సి.ఎం.ఎస్. స్థితిగతులు, భూ భారతి పాత, కొత్త పెండింగ్ కేసులు, భూసేకరణ పురోగతి, జి.ఓ. నంబర్ 59, 76 క్రింద క్రమబద్ధీకరణ దరఖాస్తులు, మీ-సేవ ధ్రువపత్రాల పెండింగ్ దరఖాస్తులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కార స్థితిగతులను సమీక్షించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
నిర్దేశించిన విధివిధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా రీసర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని బూదఖుర్ద్ గ్రామంలో కొనసాగుతున్న రీ సర్వే పనులను సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎ.డి. శ్రీనివాస్, మండల తహసిల్దార్ కృష్ణ, గ్రామ సర్పంచ్ లతో కలిసి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు, అధికారులు పాల్గొన్నారు.