కుష్టు వ్యాధి గుర్తింపునకు ఇంటింటా సర్వే
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో కుష్టు వ్యాధి కేసుల గుర్తింపునకు ఈ నెల 22 నుంచి నవంబర్ 4 వరకు ఇంటింటా సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కుష్టు వ్యాధి కార్యక్రమ(Telangana State Leprosy Program) పరిశీలకురాలు, జిల్లా పర్యవేక్షణ అధికారి డాక్టర్ విజయనిర్మల గురువారం తాండూరు, మందమర్రి, తాళ్లగురజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు.
సర్వేకు చేపట్టిన ఏర్పాట్లపై వైద్యులు, సిబ్బందితో సమీక్షించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేంద్ర రాథోడ్తో సమావేశమై కార్యక్రమ ప్రణాళికలు, ప్రచార సామగ్రిని పరిశీలించారు. జిల్లాలో ఇప్పటివరకు 59 కుష్టు వ్యాధి కేసులను గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా డాక్టర్ విజయనిర్మల మాట్లాడుతూ.. కుష్టు వ్యాధి వంశపారంపర్యంగా వచ్చేది కాదని, శాపం లేదా పాపం వల్ల సంక్రమించదని స్పష్టం చేశారు. చర్మంపై స్పర్శ తెలియని పాలిపోయిన, ఎర్రని లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. బహుళ ఔషధ చికిత్సతో వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. సర్వేలో భాగంగా ఆశ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది బృందాలు ఇంటింటికీ వస్తాయని, ప్రజలు సహకరించి పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, సీహెచ్వోలు పుట్ట సత్తయ్య, నాందేవ్, అల్లాడి శ్రీనివాస్, వైద్యులు డాక్టర్ ఝాన్సీ, డాక్టర్ లక్ష్మి, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు.