సీసీ కెమెరాలను ప్రారంభించిన భద్రాచలం డీఎస్పీ
దుమ్ముగూడెం: (విజయక్రాంతి): నేరాల నియంత్రణ, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్(Dummagudem Police Station) పరిధిలోని లక్ష్మీనగర్, ములకలపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పర్యవేక్షణ వ్యవస్థను భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్(Bhadrachalam DSP Arun Kumar) గురువారం ప్రారంభించారు.
దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డీఎస్పీ, స్టేషన్ నుంచే గ్రామాల్లోని సీసీ కెమెరాలను పర్యవేక్షించే వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనించేందుకు, నేరాల నియంత్రణ, ఛేదనకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ప్రజల భద్రత మరింత బలోపేతం అవుతుందని, శాంతిభద్రతల పరిరక్షణకు సమర్థవంతంగా పనిచేయవచ్చని పేర్కొన్నారు. కెమెరాల ఏర్పాటుకు ఆర్థికంగా సహకరించిన వ్యాపారులను ఈ సందర్భంగా సన్మానించి అభినందించారు. ప్రజల భద్రత కోసం పోలీసులకు సహకరించాలని, నేరాల నివారణకు ప్రజలు, వ్యాపారులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ రికార్డులు, పరిసరాలను పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కరించి, మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య, ఎస్ఐ జగన్మోహన్ చారి, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.