అసాంఘిక చర్యలకు పాల్పడితే తప్పవు
- మంచిర్యాల డీసీపీ భాస్కర్
మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): అసాంఘిక కార్యకలాపాలకు(Anti-Social Activities) పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్(Mancherial DCP Eggadi Bhaskar) హెచ్చరించారు. జిల్లాలోని నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షిర్కే కాలనీలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ సోమవారం అర్ధరాత్రి శ్రీరాంపూర్ సీఐ అశోక్, నస్పూర్ ఎస్ఐ తహసీనుద్దీన్ లతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్ ఉన్న వ్యక్తులతో పాటు అర్ధరాత్రి వేళల్లో అనవసరంగా వాహనాలపై తిరుగుతూ అనుమానాస్పదంగా కనిపించిన యువకులను విచారించారు.
ఈ సందర్భంగా వారికి డీసీపీ కౌన్సెలింగ్ నిర్వహించారు. రాత్రి వేళల్లో అనవసరంగా సంచరిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడినా, నేరప్రవృత్తిని కొనసాగించినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కేసులు నమోదు చేయడంతో పాటు, నేరాల తీవ్రతను బట్టి రౌడీషీట్లు తెరిచి కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం నిఘా కొనసాగుతుందన్నారు. ఈ తనిఖీలలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.