వానలు, ఎల్నినోతో రైతులకు నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలి
దామరచర్ల: ప్రస్తుతం కురుస్తున్న ఆకస్మిక గాలి వానలు, రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావం(El Niño effects)తో తలెత్తే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(MLA Battula Laxma Reddy) అధికారులను ఆదేశించారు. తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఆకస్మికంగా వీస్తున్న ఈదురుగాలులు, కురుస్తున్న వర్షాల వల్ల పంటలకు కలుగుతున్న నష్టాన్ని ఎప్పటికప్పుడు గుర్తించాలని, రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావం కారణంగా తలెత్తే వాతావరణ మార్పులు, వాటి వల్ల వ్యవసాయ రంగానికి ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు గాలివానల సమయంలో విద్యుత్ అంతరాయాలు, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లను వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు, ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటూ సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.రైతుల సంక్షేమం, ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యత అని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..