గుడుంబా స్థావరాలపై పోలీసు, ఎక్సైజ్ శాఖ దాడులు

03-11-2026 | 12:09pm

గుడుంబా తయారీ, విక్రయాలపై ముగ్గురిపై కేసులు

25 లీటర్ల నాటుసారా స్వాధీనం,2 వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

సరైన పత్రాలు లేని 40 వాహనాలు సీజ్

గంజాయి, గుడుంబాపై కఠిన చర్యలు తప్పవు: సీఐ కృష్ణ

కోటపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial district) కోటపల్లి మండలం అలుగామ గ్రామంలో మంగళవారం పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న దుర్గం స్వామి, దాగం రమేష్, దాగం గోపాల్‌పై కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 25 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, తయారీకి సిద్ధంగా ఉంచిన 2 వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.

అనంతరం గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమంలో సరైన వాహన పత్రాలు లేని 40 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ మాట్లాడుతూ.. గుడుంబా తయారీకి పాల్పడినా, గంజాయి విక్రయించినా, సేవించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కొద్దిపాటి డబ్బు కోసం కుటుంబాల జీవితాలతో చెలగాటమాడవద్దని, యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ దాడుల్లో కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్, నిల్వాయి ఎస్ఐ నాగరాజు, ఎక్సైజ్ ఎస్ఐ సాయి, పోలీస్, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు