వైద్యులు సమయపాలన పాటించాలి
ఆరోగ్య కేంద్రాల్లో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు
మంచిర్యాల క్రైమ్, నవంబర్ 20 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో(Government health center) వైద్యులు, సిబ్బంది విధులకు(Duties of doctors and staff) సకాలంలో హాజరై ప్రజలకు మెరుగైన వైద్య సేవలు(Medical Services) అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశించారు. శుక్రవారం కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Kasipet Primary Health Centre)తో పాటు దీపక్ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరు నమోదు చేయాలని సూచించారు. రోజువారీ హాజరు వివరాలను జిల్లా కలెక్టర్, కమిషనర్‌కు పంపిస్తామని తెలిపారు.
ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ల నిల్వలను పరిశీలించారు. ప్రతి బుధ, శనివారాల్లో నిర్వహించే టీకాల కార్యక్రమానికి ముందుగానే పిల్లల వివరాలు సిద్ధం చేసుకోవాలని, పర్యవేక్షకులు ఉపకేంద్రాలను సందర్శించి కార్యక్రమాన్ని పరిశీలించాలని సూచించారు. గర్భిణులందరినీ నమోదు చేసి వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు అందజేయాలని ఆదేశించారు. మాతా శిశు సంరక్షణ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలన్నారు. హెచ్‌పీవీ టీకాల కార్యక్రమంలో 14 ఏళ్లు నిండిన బాలికలకు టీకాలు వేయించాలని పేర్కొన్నారు.
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించి సిజేరియన్ల సంఖ్య తగ్గించేలా గర్భిణులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ-సంజీవని కార్యక్రమంలో రోగుల వివరాలు, వైద్య సేవలు, మందుల నిల్వలను వంద శాతం నమోదు చేయాలన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి తగిన చికిత్స అందించాలని, చిన్నారుల్లో వ్యాధి లక్షణాలు గుర్తిస్తే పిల్లల వైద్య నిపుణులతో పరీక్షలు చేయించి పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
దీపక్ నగర్ అర్బన్ ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తలతో అసంక్రమిత వ్యాధుల గుర్తింపు, నమోదు, మందుల పంపిణీపై సమీక్షించారు. వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ నిర్వహించే వారాంతపు సమీక్షకు ముందే నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు దివ్య, రేవంత్, అనిల్, జాహ్నవి, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.