ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా.. ఇందిరమ్మ జీవిత బీమా!
అర్హులైన ప్రతి కుటుంబం బీమా పథకంలో నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఇల్లెందు, (విజయక్రాంతి): పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా(Financial Security) కల్పించడమే ఇందిరా గాంధీ కుటుంబ జీవిత బీమా పథకం(Indira Gandhi Family Life Insurance Scheme) ప్రధాన లక్ష్యమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(Illandu MLA Koram Kanakaiah) అన్నారు. కుటుంబానికి జీవనాధారమైన సంపాదనపరుడికి అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా అండగా నిలవడమే ఈ పథకం ఉద్దేశమని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకంలో నమోదు చేసుకోవాలని సూచించారు. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా శుక్రవారం ఇల్లందు పురపాలక సంఘం పరిధిలోని మొదటి వార్డు సత్యనారాయణపురంలో నిర్వహించిన నమోదు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీమా పథకం నమోదు ప్రక్రియను ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేషన్ కార్డులు కలిగిన అర్హులైన కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం కుటుంబ జీవిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తోందన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, మున్సిపల్ చైర్మన్ దొడ్డా కిరణ్ మిత్ర డానియల్, మున్సిపల్ కమిషనర్ సందీప్, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.