26న నల్లమల్లకు సీఎం రేవంత్ రెడ్డి రాకా
* ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎంపీ ఎమ్మెల్యేలు
* మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలు
అచ్చంపేట, నవంబర్ 20 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డి(Enamala Revanth Reddy) నల్లమల్ల పర్యటన ఖరారైంది. సీఎం ఈనెల 26న నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool district) అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అందులో భాగంగా మద్దిమడుగులోని పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం(Pabbathi Anjaneyaswamy Temple) సమీపంలో ఏర్పాటు చేసిన గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్(Sant Sevalal) విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అచ్చంపేటలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. సభాస్థలని అధికారులు, ఎమ్మెల్యే పరిశీలించారు.
* మద్దిమడుగులో ఎంపీ, ఎమ్మెల్యే
పదర మండలం మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయాన్ని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు అర్చకులు వీరయ్య శాస్త్రి, వేదవ్యాస్, ఈవో రంగాచారి, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆలయ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో అచ్చంపేట డివిజన్ సబ్ కలెక్టర్, మద్దిమడుగు దేవస్థానం చైర్మన్ రాములు నాయక్, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.