విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలి
అదనపు కలెక్టర్ చంద్రయ్య
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు సాంస్కృతిక రంగాలలో రాణించాలని జిల్లా అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి చంద్రయ్య(Education Department Officer Chandrayya) అన్నారు. మంగళ వారం జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ఆవరణల గల జిల్లా సైన్స్ సెంటర్ లో PMSHRI పాఠశాలల్లోని విద్యార్థులకు నిర్వహించిన కళా–సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
PMSHRI పాఠశాలలు విద్యార్థులకు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రతిభ, నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇలాంటి కళా–సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు తమలోని ప్రతిభను వెలికితీసుకుని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ఈ వేదికలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, వేదికపై ప్రదర్శన సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. సుమారు 250 మంది విద్యార్థులు వివిధ కళా–సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అన్ని PMSHRI పాఠశాలల గైడ్ టీచర్లు విద్యార్థులతో కలిసి కార్యక్రమానికి హాజరై, వివిధ కళా ప్రదర్శనల్లో విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం, సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో PMSHRI పాఠశాలల విద్యార్థులు జానపద నృత్యం, శాస్త్రీయ నృత్యం, సోలో గానం, బృంద గానం, నాటకం, కవితా పఠనం, వక్తృత్వం, వాయిద్య సంగీతం, చిత్రలేఖనం తదితర కళా విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు.
పోటీల న్యాయనిర్ణేతలుగా ఎ. సత్యనారాయణ, బి. అశోక్, ఎ. రాజన్న, ఆర్. ప్రసాద్, బి. సంతోష్, స్వర్ణ, సాంబయ్య, మధు, శ్రీకర్, సుమన, యాదగిరి, శ్రీనివాస్ తదితరులు వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి క్వాలిటీ కోఆర్డినేటర్ గా జంబోజు సత్తయ్య, కార్యక్రమ ఇన్‌చార్జిలుగా గిరిధర్ రెడ్డి, బి. శంకరి, కె. జనార్దన్ వ్యవహరించారు. PMSHRI ZPHS నీల్వాయి ప్రధానోపాధ్యాయులు కార్యక్రమ నిర్వహణకు సహకరించారు.