జాతీయ రహదారిపై విద్యార్థుల ధర్నా
29-09-2026 | 03:48pm
సుల్తాన్పూర్ జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం
సంగారెడ్డి, సెప్టెంబర్ 29 : సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం సుల్తాన్ పూర్ జేఎన్టీయూ క్యాంపస్ లో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. జేఎన్టీయూ క్యాంపస్ లో సోమవారం సాయంత్రం సెకండ్ ఇయర్ ట్రిపుల్ ఈ చదువుతున్న విద్యార్థి రుత్విక్ పై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడినట్లు ఆరోపించారు.
సీనియర్ల వైఖరి పై కళాశాల ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో క్యాంపస్ ఎదుట బైఠాయించి విద్యార్థులు ఆందోళనకు దిగారు. 161వ జాతీయ రహదారిపై విద్యార్థుల ధర్నా చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పారు. ర్యాగింగ్ కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.