పంచాయతీలకు తాళం!?
- గ్రామ ప్రజలకు కార్యదర్శులు దూరం
- అటెండెన్స్ వేసి 11 గంటలకే మాయం
- మండల పనుల పేరుతో గ్రామాల్లో విధులకు ఎగనామం
కొల్చారం, నవంబర్ 22 : గ్రామాల్లో ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన పంచాయతీ కార్యదర్శులే(Panchayat Secretaries) అందుబాటులో లేకపోతే ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? ఉదయం కార్యాలయానికి వచ్చి అటెండెన్స్ నమోదు చేసుకోవడం..
ఆపై మండల కేంద్రంలో పనులున్నాయంటూ గ్రామ కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్లిపోవడం కొల్చారం మండలంలోని కొన్ని గ్రామాల్లో పరిపాటిగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం 11 గంటలకే కార్యాలయాలు మూతపడుతుండటంతో పంచాయతీ పనుల కోసం వచ్చే ప్రజలకు కార్యదర్శులు దర్శనమివ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కార్యాలయాలకు వెళ్లినా.. తాళాలే దర్శనం!
గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, పన్నుల చెల్లింపులు, ధ్రువీకరణ పత్రాలు, ఇతర పంచాయతీ పనుల కోసం ప్రజలు కార్యాలయాలకు వస్తుంటారు. తీరా కార్యాలయానికి చేరుకుంటే తాళాలు దర్శనమివ్వడం, కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో పనుల కోసం వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంటోంది. చిన్నచిన్న పనుల కోసం సైతం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అటెండెన్స్కే పరిమితమా విధులు?
ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గ్రామస్థాయిలో పంచాయతీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తే.. కొందరు కార్యదర్శులు వాటిని తెరిచి ఉంచడంలోనే నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటెండెన్స్ నమోదు చేసుకున్న తర్వాత మండల పనుల పేరుతో గ్రామ కార్యాలయాలను వదిలి వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మండల కార్యాలయంలో పనులు ఉన్నా గ్రామ ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వడం, కార్యాలయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం వంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయని అంటున్నారు.
ఉన్నతాధికారులు స్పందించరా?
ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పంచాయతీ కార్యదర్శులు విధులకు దూరంగా ఉంటే గ్రామాల్లో సమస్యలు పరిష్కారమయ్యేదెలా? కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్లే తీరుపై ఉన్నతాధికారులు ఎందుకు పర్యవేక్షణ చేపట్టడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కార్యదర్శుల హాజరు, విధుల నిర్వహణపై పర్యవేక్షణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుని పంచాయతీ కార్యాలయాలు నిర్ణీత పని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.