మహాలక్ష్మి రూపంలో వనదుర్గమ్మ

15-10-2026 | 01:25pm

పాపన్నపేట, అక్టోబర్ 15 (విజయక్రాంతి): మంజీరా నది ఏడు పాయలుగా చీలి ప్రవహించే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు (Sharannavaratri Celebrations) కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం పంచమిని పురస్కరించుకుని వనదుర్గమ్మను మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించారు.

ప్రత్యేక అలంకరణలో అమ్మవారు

ఆలయ అర్చకులు వేకువజామునే అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం పెసర రంగు చీరతో పాటు వివిధ రకాల పుష్పాలు, పూజా సామగ్రితో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. మహాలక్ష్మి (Mahalakshmi) అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని దుర్గమ్మను వేడుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో సందడిగా మారింది. ఉత్సవాల్లో ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రేపు సరస్వతి దేవి రూపంలో దర్శనం

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం వనదుర్గమ్మ చదువుల వరదాయిని సరస్వతి దేవి రూపంలో (Saraswati Devi) భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని తెలుపు రంగు వస్త్రాలతో అలంకరించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఆలయంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు