బోనమెత్తిన ఏడుపాయల..

15-10-2026 | 02:54pm
  1. భక్తిపారవశ్యంలో వనదుర్గమ్మ భక్తులు
  2. మహాలక్ష్మి రూపంలో వనదుర్గమ్మ దర్శనం
  3. భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్యేలు..
  4. ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు

పాపన్నపేట,అక్టోబర్15: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత(Vanadurga Mata of Edupayala) చెంత గురువారం బోనాల జోరు హోరెత్తింది. వన దుర్గమ్మ ఆలయం చెంత ఉన్న గోకుల్ షెడ్ లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన గురువారం వనదుర్గమ్మను మహాలక్ష్మి దేవి రూపంలో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.

అనంతరం గోకుల్ షెడ్ లో ప్రతిష్టించిన ఉత్సవ విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. బోనాలను డప్పు చప్పుళ్ళు.. మేళ తాళాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి వనదుర్గమ్మకు సమర్పించారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఏడుపాయల వన దుర్గమ్మ క్షేత్రం హోరెత్తింది. వనదుర్గమ్మ తల్లి.. చల్లంగా చూడమ్మా అంటూ భక్తులు వేడుకున్నారు.

భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ

మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, గొంగిడి సునీత, తుల ఉమ ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. బోనాల సమర్పణతో సంప్రదాయ భక్తి వైభవం ఉట్టిపడింది.

అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు

గోకుల్ షెడ్ లో నిర్వహిస్తున్న ఉత్సవాల ప్రాంగణంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ అమ్మవారి కళారూపాలు, చిన్నారుల ప్రతిభాపాటవాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల ప్రదర్శనలను భక్తులు ఆసక్తిగా తిలకించి అభినందించారు.

భక్తి.. సంప్రదాయం.. ఆధ్యాత్మిక వైభవం!

అమ్మవారి దర్శనం, బోనాల సమర్పణలు, భక్తుల పూజలు, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఏడుపాయల క్షేత్రం ఆధ్యాత్మిక కళను సంతరించుకుంది. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న వనదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

మరిన్ని వార్తలు