రావణాసుర దహనం కార్యక్రమాన్ని రద్దు చేయాలి

15-10-2026 | 03:07pm

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు

హుజురాబాద్,అక్టోబర్15: (విజయక్రాంతి): దసరా పండుగ సందర్భంగా రామ్‌లీలా పేరుతో నిర్వహించే రావణాసుర దహనం(Ravanasura Dahanam) కార్యక్రమాన్ని రద్దు చేయాలని బీసీ ఉద్యమ వేదిక, తెలంగాణ అంబేద్కర్ సంఘం(Telangana Ambedkar Association) నాయకులు డిమాండ్ చేశారు. రావణాసురుడి బొమ్మలో బాంబులు, టపాకాయలు ఏర్పాటు చేసి భారీ శబ్దాలతో పేల్చడం వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని, శబ్ద కాలుష్యం పెరగడంతో పాటు కొందరి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ మేరకు హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజాధనాన్ని ఇటువంటి కార్యక్రమాలకు దుర్వినియోగం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వినతిపై మున్సిపల్ అధికారులు సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యమ వేదిక మండల కన్వీనర్, రిటైర్డ్ గెజిటెడ్ హెడ్‌మాస్టర్ సాదుల రవీందర్ బాబు, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి వేల్పుల రత్నం, బాబు జగ్జీవన్‌రావు జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మట్టెడ ప్రకాష్, సామాజిక ఉద్యమ నాయకుడు వేల్పుల ప్రభాకర్, బీసీ నాయకులు కొలిపాక సారయ్య, కొలిపాక సమ్మయ్య, కే. రాజేందర్, టీ. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు