రుద్రంగి మార్కెట్ కమిటీ కార్యాలయం
రుద్రంగి అక్టోబర్ 15(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సుమారు రూ.42 లక్షలతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని(Agricultural Market Committee Office) గురువారం మార్కెట్ కమిటీ చెర్మన్ చేలుకల తిరుపతి తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్ అధిశ్రీనివాస్(State Government Whip Adhisrinivas) ప్రారంభించారు.
ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని రుద్రంగి మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ.70 లక్షలకు పైగా నిధులతో పనులకు టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు. త్వరలోనే ఈ పనులకు భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు.
మార్కెట్ యార్డు అభివృద్ధికి సంబంధించి ప్రస్తుతం ట్రెజరీలో సుమారు రూ.5 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని,గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మరో రూ.కోటి నిధులు రావాల్సి ఉందని చెప్పారు. మొత్తంగా రూ.6 కోట్లకు పైగా నిధులతో రుద్రంగి మార్కెట్ పరిధిలోని రైతులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు.రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ పథకం కింద సుమారు 25.25 లక్షల కుటుంబాలకు రూ.20,650 కోట్ల మేర ప్రయోజనం కల్పించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6,200 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు.
సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ప్రకటించడం ద్వారా రైతులకు భరోసా కల్పించామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించడం ద్వారా రైతులకు లోవోల్టేజీ సమస్యలు లేకుండా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ నియోజకవర్గంలో ఇప్పటివరకు 19 ప్రాంతాల్లో సబ్స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రుద్రంగిలో 132/33 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.అలాగే 8 ఎకరాల స్థలంలో 8 వేల నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు.
రుద్రంగి మండలంతోపాటు వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. రైతులు, మహిళలు, పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.ఈకార్యక్రమంలో వైస్ చెర్మన్ బొజ్జ మల్లేశం మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సర్పంచ్ గండి నారాయణ, తహసీల్దార్ పుష్పలత,కార్యదర్శి సరోజన కాంగ్రెస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు