లంచాల ఊబిలో రెవెన్యూ..!

17-10-2026 | 05:20am

ఏసీబీ దెబ్బకు వణుకుతున్న అవినీతి ఆఫీసర్లు

మండలంలో ఇతర శాఖలకు పాకిన ఫోబియా 

అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయం(Abdullapurmet Tehsildar Office)లో వెలుగుచూసిన భారీ అవినీతి బాగోతం ఉమ్మడి రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా రూ.20 లక్షల లంచం డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖ (ACB)కి అడ్డంగా దొరికిపోయిన ఉదంతం.. ఇప్పుడు కేవలం రెవెన్యూ శాఖకే పరిమితం కాకుండా, మండలంలోని ఇతర ప్రభుత్వ శాఖల అధికారులనూ తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

అసలేం జరిగింది..?

భూముల మ్యుటేషన్లు, రెవెన్యూ రికార్డుల తారుమారు, వివిధ రకాల అనుమతులు మరియు ప్రభుత్వ ఫైళ్ల కదలికల వెనుక కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడి.. అవినీతి అధికారులకు గట్టి హెచ్చరికలా మారింది. ఈ ఘటనతో మండలంలోని పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్, ఇతర శాఖల అధికారుల్లోనూ గుబులు మొదలైంది.విజిలెన్స్ పర్యటనలతో ఉత్కంఠ ఈ పరిణామాల వేళ, గత రెండు మూడు రోజులుగా మండల పరిధిలో విజిలెన్స్ అధికారులు వరుస పర్యటనలు చేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. 

ఈ తనిఖీలు తహసీల్దార్ లంచం కేసులో భాగంగా జరుగుతున్నాయా? లేక సాధారణ తనిఖీలా..?

మండలం లో విజిలెన్స్ రాకతో అధికారుల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏయే రికార్డులను పరిశీలిస్తున్నారు? ఏయే శాఖలపై నిఘా పెట్టారనే అంశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.అధికారుల తీరుపై ప్రజల మండిపాటు సేవలందడంలో జాప్యం:  సాధారణ ప్రజలు తమ చిన్న చిన్న పనుల నిమిత్తం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు, పైసలు చేతిలో పెడితేనే ఫైళ్లు కదిలిస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వ శాఖల్లో డిజిటలైజేషన్ వస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అవినీతి దళారుల ప్రమేయం తగ్గకపోవడం గమనార్హం.

ఉన్నతాధికారులు స్పందిస్తారా..?

ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, కేవలం ఒకరిద్దరు అధికారులపై చర్యలు సరిపోవని, ప్రభుత్వకార్యాలయాలన్నింటిలోనూ ప్రక్షాళన జరగాలని ప్రజలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి. ఫైళ్ల పరిష్కారానికి నిర్దిష్టమైన గడువు విధించి, పారదర్శక పాలన అందించేలా ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విజిలెన్స్ విచారణలో ఎలాంటి నిజాలు వెలుగుచూస్తాయో, రాబోయే రోజుల్లో ఏయే శాఖలపై వేటు పడుతుందోనని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మరిన్ని వార్తలు