ర్యాగింగ్ అనేది తీవ్రమైన నేరం.. కఠిన చర్యలు ఉంటాయి

06-10-2026 | 11:10pm

పోచారం ఇన్ స్పెక్టర్ డాక్టర్ జి. జగన్నాథ్ 

ఘట్ కేసర్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ(Anurag University)లో పోచారం ఐటి కారిడార్ పోలీసుల భాగస్వామ్యంతో యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ జగన్నాథ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ర్యాగింగ్ అనేది తీవ్రమైన నేరమని, దీనికి పాల్పడితే తెలంగాణ ప్రాహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని విద్యార్థులకు స్పష్టం చేశారు.

ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, కాలేజీ నుండి సస్పెన్షన్, బర్తరఫ్ చేయడం, అలాగే భవిష్యత్తులో ఉద్యోగాలు లేదా ఉన్నత చదువులకు వెళ్లేటప్పుడు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ రాకుండా బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం జరుగుతుందని హెచ్చరిస్తారు. కాలేజీలో కొత్తగా చేరిన విద్యార్థులు భయం లేకుండా తమ చదువు కొనసాగించాలని తెలిపారు. కళాశాలలో విద్యార్థినీలకు వేధింపులు ఎదురైతే షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని,  సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివరించారు. 

ర్యాగింగ్ లేదా వేధింపులకు గురైతే వెంటనే 100/112 లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కు  సమాచారం ఇవ్వాలని సూచించారు. యూనివర్సిటీ లోపల ఉన్న యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ కమిటీ సభ్యులకు, అధ్యాపకులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు