ఐఐఎం జమ్మూ నుంచి అరుణ్‌కు పట్టా
ఘట్ కేసర్, అక్టోబర్ 11 (విజయక్రాంతి) : భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(Indian Institute of Management) (ఐఐఎం) జమ్మూ క్యాంపస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(Dalit Indian Chamber of Commerce and Industry) (డిఐసిసిఐ) సహకారంతో నిర్వహించిన బిజినెస్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్(Business Accelerator Program) విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఘట్ కేసర్(Ghatkesar) పట్టణానికి చెందిన డిఐసిసిఐ నెక్స్ట్‌జెన్ తెలంగాణ చాప్టర్ కన్వీనర్ మీసాల అరుణ్ కుమార్(Meesala Arun Kumar) కన్వొకేషన్ సర్టిఫికెట్ అందుకున్నారు.
ఐఐఎం జమ్మూ డీన్ (ఫ్యాకల్టీ అండ్ రీసెర్చ్) ప్రొఫెసర్ జబీర్ అలీ చేతుల మీదుగా ఈ సర్టిఫికెట్ అందుకున్నారు. ఐఐఎం జమ్మూ చైర్మన్ ప్రొఫెసర్ బి.ఎస్. సాహాయ్ సహకారంతో, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సమన్వయంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా వ్యాపార నిర్వహణ, వ్యాపార విస్తరణ, వ్యూహాత్మక ప్రణాళికలు, పారిశ్రామిక నైపుణ్యాలపై అరుణ్ కుమార్ విలువైన జ్ఞానాన్ని పొందారు.
ఈ సందర్భంగా మీసాల అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఐఐఎం జమ్మూ, డిఐసిసిఐ అందించిన ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక, ఇప్పటికే వ్యాపారాలు నిర్వహిస్తున్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థిక సాధికారతకు కృషి చేస్తానని పేర్కొన్నారు.