ఎల్బీనగర్ జోనల్ ఆఫీస్ ఎదుట బీజేపీ ధర్నా

11-09-2026 | 12:59pm

కుక్కల దాడిలో గాయపడిన చిన్నారి అద్విక్‌ చికిత్స 

పెండింగ్ ఆసుపత్రి బిల్లులు చెల్లించాలని డిమాండ్ 

ఎల్బీనగర్,సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): హస్తినాపురం డివిజన్‌లో(Hastinapuram Division) మే 11న కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి అద్విక్ ప్రస్తుతం ఎల్బీనగర్‌లోని(LB Nagar) కామినేని ఆసుపత్రిలో(Kamineni Hospital) చికిత్స పొందుతున్నాడు. చిన్నారి వైద్యచికిత్సకు సంబంధించిన ఆసుపత్రి బిల్లు సుమారు రూ, 16 లక్షలకు చేరుకుంది. ఘటన జరిగిన సమయంలో అద్విక్‌కు అయ్యే పూర్తి వైద్య ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని అధికారులు బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అయితే పెండింగ్‌ బిల్లులు విడుదల కాకపోవడంతో  చిన్నారికి అవసరమైన తదుపరి వైద్య చికిత్స కొనసాగించడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా బీజేపీ ఎల్బీనగర్ ఇన్చార్జి(BJP LB Nagar In-charge) సామ రంగారెడ్డి మాట్లాడుతూ... చిన్నారి అద్విక్‌కు ఇంకా వైద్య చికిత్స అవసరం ఉందని, ఆసుపత్రి బిల్లుల కారణంగా బాధిత కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు పెండింగ్‌లో ఉన్న చికిత్స బిల్లు వెంటనే విడుదల చేయడంతో పాటు, ఇకపై అద్విక్‌కు అవసరమయ్యే పూర్తి వైద్య చికిత్సకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం జోనల్ కమిషనర్ వికాస్(Zonal Commissioner Vikas) మహాతో వెంటనే స్పందించి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తో మాట్లాడారు.  ఆయన కామినేని ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి, వారం రోజుల్లో పెండింగ్‌లో ఉన్న ఆసుపత్రి బిల్లును చెల్లిస్తామని, అలాగే చిన్నారి అద్విక్‌కు అవసరమయ్యే ఎటువంటి వైద్య చికిత్సకైనా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, బీజేపీ బైరామల్ గూడ డివిజన్ అధ్యక్షుడు ఎరుకల మల్లేశ్ గౌడ్, జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు