జవహార్ నగర్ భూములపై వివాదం
వెంకటాపూర్, నవంబర్ 19 (విజయక్రాంతి): మండలంలోని జవహార్ నగర్ శివారులో ఉన్న సర్వే నంబర్లు 339, 340, 368, 331, 431లోని అసైన్డ్ భూములపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా కో-ఇంచార్జి కాడపాక శ్యామ్ డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలోని తాళ్లపాడు సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో కొంతమంది అధికారులు, ఇతర వ్యక్తులు కుమ్మక్కై ప్రభుత్వ భూములకు అక్రమంగా పట్టాలు పొందారని ఆరోపించారు. ఆ భూములకు సంబంధించిన పాస్ పుస్తకాల ఆధారంగా బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడంతోపాటు రైతుబంధు (Rythu Bandhu) కూడా పొందుతున్నారని తెలిపారు.
ఒక్కొక్కరు ఐదు ఎకరాల చొప్పున వందల ఎకరాల ప్రభుత్వ భూములకు పట్టాలు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. అక్రమ పట్టాల వ్యవహారంలో సహకరించిన అధికారులతో పాటు లబ్ధి పొందిన వారిపై సమగ్ర విచారణ (Investigation) జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అక్రమంగా పొందిన పట్టాలను రద్దు చేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. స్వాధీనం చేసుకున్న భూములను మండలంలోని నిరుపేద దళితులకు పంపిణీ చేయడంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల అవసరాలకు వినియోగించాలని సూచించారు. అసైన్డ్ భూముల అక్రమాలపై వార్తలు వస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు (Protest) చేపడతామని కాడపాక శ్యామ్ హెచ్చరించారు.