భద్రతకు భరోసాలో పోలీసుల ముందంజ..
తప్పిపోయిన పిల్లలను సురక్షితంగా తల్లికి అప్పగింత.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పోలీసుల విధులు ఎస్ హెచ్ ఓ: సైదులు.
జవహర్ నగర్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): ప్రజలకు భద్రత కల్పించడంలో తెలంగాణ పోలీసులు ముందు వరసలో ఉంటారని జవహర్ నగర్ ఎస్ హెచ్ ఓ సైదులు(Jawahar Nagar SHO Saidulu) పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ గబ్బిలాల పేట పరిధిలోని కేసీఆర్ నగర్ లో కూలి పని చేసుకునే పులికంటి అనురాధ ఇద్దరు మైనర్ కుమారులైన ఈశ్వర్(15) మహేందర్(7) పిల్లలు కనిపించడం లేదని డయల్ 100 ద్వారా జవహర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన జవహర్ నగర్ పోలీస్ సిబ్బంది కేవలం 90 నిమిషాల్లోనే ఇద్దరు పిల్లలను సురక్షితంగా గుర్తించి వారి తల్లికి అప్పజెప్పారు. ఈ సందర్భంగా తన పిల్లలను సురక్షితంగా అప్పగించినందుకు తల్లి పులి కంటి అనురాధ జవహర్ నగర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సైదులు మాట్లాడుతూ ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని మీ భద్రతే మా ప్రాధాన్యం అన్నారు.