స్థలాల క్రమబద్ధీకరణపై ఉత్కంఠ

17-10-2026 | 05:30am

ప్రభుత్వ నిర్ణయం కోసం వేలాది కుటుంబాల ఎదురుచూపులు

జవహర్‌నగర్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): స్థలాల క్రమబద్ధీకరణ(Land Regularization) అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకోవడంతో స్థల యజమానుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా తమ స్థలాలు, ఇళ్లకు చట్టబద్ధత కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆశాభావంతో ఉన్నాయి. ముఖ్యంగా 500 గజాల వరకు ఉన్న స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలనే డిమాండ్ ప్రజల్లో వినిపిస్తోంది. ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించి తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు.

ఏళ్లుగా కొనసాగుతున్నసమస్యలు.. 

జవహర్నగర్తో పాటు పరిసర ప్రాంతాల్లో అనేక కుటుంబాలు తమ స్థలాలు, ఇళ్లకు సంబంధించిన పత్రాలు, చట్టబద్ధత విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు జీవితకాల సంపాదనను వెచ్చించి స్థలాలు కొనుగోలు చేసిన వారు, ఇళ్లు నిర్మించుకున్న వారు తమ ఆస్తులకు పూర్తి భద్రత కల్పించాలని కోరుతున్నారు. క్రమబద్ధీకరణకు అవకాశం లభిస్తే ఆస్తులకు చట్టబద్ధత రావడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయని వారు భావిస్తున్నారు.

500 గజాల వరకు అవకాశం కల్పించాలని డిమాండ్..

స్థలాల విస్తీర్ణం, యాజమాన్య పత్రాలు, ప్రభుత్వ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని అర్హులైన వారికి క్రమబద్ధీకరణ అవకాశం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా 500 గజాల వరకు ఉన్న స్థలాల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసి, అవసరమైన పత్రాలు, చెల్లించాల్సిన రుసుములు, అర్హత ప్రమాణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.

అధికారుల చొరవ అవసరం..

స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించిన సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు కూడా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. క్రమబద్ధీకరణ ప్రక్రియలో పారదర్శకత పాటించి, నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టాలని అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూపులు..

క్రమబద్ధీకరణపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తే వేలాది కుటుంబాలకు ఊరట లభించే అవకాశం ఉందని స్థానికులు ఆశిస్తున్నారు. అయితే 500 గజాల వరకు స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి అమల్లోకి వచ్చిన అధికారిక నిర్ణయం, అర్హత నిబంధనలు నిర్ధారించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటనపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం లభించి, తమ సొంతింటికి చట్టబద్ధమైన భద్రత కల్పించే రోజు ఎప్పుడొస్తుందోనని బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.

పారదర్శక విధానం అవసరం.. 

స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి. అ ర్హులైన లబ్ధిదారులను గుర్తించి, నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణ చేపట్టాలి. దళారుల ప్రమేయం లేకుండా ప్రజలకు నేరుగా ప్రయోజనం కలిగేలా చూడాలి.

 శ్యామల శంకర్, ప్రగతినగర్

ప్రతి ఇంటికీ న్యాయం జరగాలి.. 

క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి. ఎన్నో ఏళ్లుగా స్థలాలు, ఇళ్ల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు భరోసా కల్పించాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వేలాది కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఉండాలి.            పడకంటి శంకరాచారి, కేసీఆర్ నగర్


మరిన్ని వార్తలు