ఓడిపోయిన చోటే గెలిచా!
సహజమైన నటనతో, అద్భుతమైన నృత్య ప్రతిభతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన స్టార్ హీరోయిన్ సాయిపల్లవి(Actress Sai Pallavi).. విడుదలకు సిద్ధంగా ఉన్న ‘రామాయణం’ చిత్రంలో సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా, ప్రముఖ నటుడు జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ టాక్ షోలో సాయిపల్లవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ తొలినాళ్లలోని అనుభవాలు, ఎదుర్కొన్న పరిస్థితులు, సాధించిన విజయాల గురించి ఆమె పంచుకున్న విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
“నా ప్రయాణం ఎప్పుడూ సులభంగా సాగలేదు. కొన్ని సందర్భాల్లో తిరస్కారాలు ఎదురయ్యాయి. కానీ వాటి దగ్గరే ఆగిపోకుండా, నన్ను నేను నిరూపించుకోవాలనే పట్టుదలతో ముందుకు సాగాను. నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే నా లక్ష్యం. సినిమా రంగంలోకి వచ్చిన తొలినాళ్లలో నా ముఖంపై మొటిమలు ఉండేవి, నా గొంతు విని కొందరు ఫోన్లో ‘చెప్పండి సర్’ అని సంబోధించేవారు (నవ్వుతూ). రూమ్ సర్వీస్కు ఫోన్ చేసినప్పుడు నా గొంతు విని కొందరు ‘చెప్పండి సర్’ అని సంబోధించేవారు.
నటన నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైనప్పటికీ, నా చదువుకు, వైద్యవృత్తికి కూడా నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. నేను నటిని కాకపోయి ఉంటే డాక్టర్ వృత్తి చేపట్టేదాన్ని. ఇప్పుడు ప్రేక్షకులు నన్ను సీతమ్మ అని పిలుస్తున్నారు. అప్పట్లో ‘ప్రేమమ్’ సినిమా తర్వాత కూడా నా ఫొటోలను అభిమానులు ఫేస్బుక్ డీపీలుగా పెట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయా. ఒక నటిగా ప్రేక్షకుల నుంచి ఇలాంటి ప్రేమను పొందడం ఆనందంగా ఉంటుంది.
ప్రతి పాత్రలోనూ నిజాయితీగా నటించడానికి ప్రయత్నిస్తా. నా జీవితంలో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అని చెప్పుకోదగ్గ సంఘటన అంటే, నేను ఒకప్పుడు ఓడిపోయిన చోటే మళ్లీ విజయం సాధించడం. ఒకప్పుడు అదే సెట్లో నేను విఫలమయ్యా. కానీ ఆ తర్వాత ‘రౌడీ బేబీ’ పాట కోసం అదే సెట్లో ప్రభుదేవా సర్ నాకు కొరియోగ్రఫీ చేశారు. ఒకప్పుడు ఓటమిని ఎదుర్కొన్న చోటే మరోసారి నిలబడి విజయం సాధించడం నా ప్రయాణంలో గుర్తుండిపోయే సంఘటన. కష్టపడితే ఎప్పటికైనా ఫలితం వస్తుందని నేను నమ్ముతా” చెప్పుకొచ్చింది సాయిపల్లవి.