నా కల నెరవేరలేదు!

17-10-2026 | 05:05am

భారతీయ సంగీత దిగ్గజం, భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కాల్సిన బయోపిక్‌లో నటించాలనే తన చిరకాల వాంఛ నెరవేరకపోవడంపై ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్(Bollywood actress Vidya Balan) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడం తనను ఇప్పటికీ బాధ పెడుతోందని భావోద్వేగానికి గురయ్యారు. గతంలో ప్రముఖ దర్శకుడు రాజీవ్ మీనన్ దర్శకత్వంలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్ రూపుదిద్దుకోవాల్సింది.

దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. అయితే, కొన్ని చట్టపరమైన సమస్యల కారణంగా ఈ సినిమాపై కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. “చిన్నప్పటి నుంచి ఎమ్మెస్ అమ్మ సుప్రభాతం, సంగీతం వింటూ పెరిగాను. ఆమె పాత్రలో నటించడం నా కల. ఆ సినిమా ఆగిపోయినప్పటి నుంచి నా గుండె పగిలింది” అంటూ ఈ సందర్భంగా విద్యాబాలన్ ఆవేదనను పంచుకున్నారు. 2024లో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి 108వ జయంతి సందర్భంగా విద్యాబాలన్ ఆమె రూపంలో ఒక అద్భుతమైన ఫోటోషూట్ చేశారు.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోషూట్ సక్సెస్ చూసి, సుబ్బులక్ష్మి బయోపిక్ తీసేందుకు ఏకంగా ఏడుగురు దర్శక నిర్మాతలు విద్యాబాలన్‌ను సంప్రదించారు. అయితే ఆమె వారికి ఒకే ఒక స్పష్టమైన కండిషన్ పెట్టారు. ‘ఎమ్మెస్ అమ్మ బయోపిక్ చేయాలంటే ఆమె కుటుంబం లేదా సంబంధిత వర్గాల నుంచి అన్ని రకాల అనుమతులు కచ్చితంగా ఉండాలి. న్యాయపరమైన అనుమతులు తెస్తేనే నేను ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తా, లేదంటే చేయలేను’ అని తేల్చి చెప్పినట్లు విద్యాబాలన్ వెల్లడించారు.

అలా సరైన అనుమతులు లేకపోవడం వల్లే ఆమె ఆ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, అల్లు అరవింద్ నిర్మాణ భాగస్వామ్యంతో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్ సరికొత్తగా పట్టాలెక్కింది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. విద్యాబాలన్ ఈ ప్రాజెక్టులో భాగం కాకపోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, చిత్రబృందం రష్మికతో ఈ ప్రతిష్టాత్మక సినిమాను ముందుకు తీసుకెళ్తోంది. 


మరిన్ని వార్తలు