హృతిక్‌కు గ్లోబల్ క్రేజ్
ముంబై: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ సినీ, కళా ప్రపంచంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే లాస్ ఏంజిల్స్ కౌంటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (LACMA) ఆర్ట్ + ఫిల్మ్ గాలాకు హాజరైన తొలి భారతీయ నటుడిగా గుర్తింపు పొందాడు. నవంబర్ 7న జరిగిన ఈ వేడుకలో హృతిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తన స్టైలిష్ లుక్‌తో పాటు భారతీయ సంప్రదాయాన్ని చాటిన తీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు.
LACMA ఆర్ట్ + ఫిల్మ్ గాలాలో హృతిక్ తన ప్రత్యేకమైన ఫ్యాషన్ స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ (Luxury Fashion Brand) 'బ్రునెల్లో కుసినెల్లి' రూపొందించిన డార్క్ బ్లూ టక్సెడో ధరించి రెడ్ కార్పెట్‌పై సందడి చేశాడు. ఫొటోగ్రాఫర్ల ముందు పోజులిస్తూ రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం చాటిన ఆయన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి హాలీవుడ్ ప్రముఖ నటుడు లియోనార్డో డికాప్రియో సహాధ్యక్షుడిగా వ్యవహరించారు. కళలు, సినిమా రంగాల అభివృద్ధికి నిధులు సమీకరించడం ఈ వేడుక ప్రధాన ఉద్దేశం. ఈ ఏడాది నిర్వహించిన 15వ వార్షిక వేడుకలో సుమారు 70 లక్షల డాలర్ల నిధులు సమీకరించినట్లు తెలుస్తోంది. హృతిక్‌తో పాటు టామ్ హ్యాంక్స్, కిమ్ కర్దాషియన్, ఆండ్రూ గార్ఫీల్డ్, తిమోథీ చలమెట్ తదితర అంతర్జాతీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ వేడుకలో భారతీయ సంతతికి చెందిన నిర్మాత కవితా గుప్తా హృతిక్‌కు ఆతిథ్యం ఇచ్చారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు డెనిస్ విల్లెన్యూవ్, నటి నికోల్ కిడ్మాన్లతో హృతిక్ దిగిన ఫొటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంతర్జాతీయ సినీ ప్రముఖులతో ఆయన కలిసిన దృశ్యాలు భారతీయ సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.ఇక సినిమాల విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ ఇటీవల 'వార్ 2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఆయన తదుపరి చిత్రాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 'క్రిష్ 4' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో హృతిక్ నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ వ్యవహరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.