రాముడి వనవాసం ముగిసింది.. నా వనవాసం ఎప్పుడు ముగుస్తుందో!
విడాకులై 14 ఏళ్లు గడిచినా తనపై విమర్శలు మాత్రం ఆగడం లేదని నటి రేణు దేశాయ్ (Renu Desai) ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితాన్ని పదేపదే గతంతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో (Social Media) చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె భావోద్వేగంగా స్పందించారు. రాముడి వనవాసం కూడా 14 ఏళ్లేనని, మరి తన వనవాసం ఎప్పుడు ముగుస్తుందని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్‌తో (Pawan Kalyan) 2012లో విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో జీవిత అనుభవాలను ఎదుర్కొన్నానని రేణు దేశాయ్ తెలిపారు. విడాకుల అనంతరం మరాఠీ సినిమాను నిర్మించడంతో పాటు దర్శకత్వం, నటన, డ్యాన్స్ షోలు, కవిత్వం వంటి విభిన్న రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి చేశానని చెప్పారు. అయినప్పటికీ తనను ఇప్పటికీ మాజీ భార్యగానే చూస్తున్నారని, తనకంటూ ఒక వ్యక్తిత్వం, జీవితం ఉన్నాయనే విషయాన్ని గుర్తించడం లేదని ఆవేదన చెందారు.
తాను చేసే ప్రతి పనినీ గత జీవితంతో ముడిపెట్టి విమర్శించడం బాధ కలిగిస్తోందన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వ్యాఖ్యలు తీవ్రంగా మనస్తాపానికి గురిచేస్తున్నాయని చెప్పారు. ఎన్నో బాధలు, బాధ్యతల మధ్య తన జీవితాన్ని తాను ముందుకు తీసుకెళ్తున్నానని వెల్లడించారు.
ఒక మహిళ జీవితాన్ని ఆమె గతంతోనే కొలవకుండా, తన ప్రతిభతో, వ్యక్తిత్వంతో గుర్తించాలని రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. ఆమె భావోద్వేగ స్పందన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.