మురసు తుఫాన్ బీభత్సం.. రంగంలోకి తుమ్మల
వెంకమ్మ చెరువు గండిని పరిశీలించిన మంత్రి తుమ్మల
పంట నష్టం, రహదారుల మరమ్మతులపై తక్షణ నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం
అశ్వారావుపేట,నవంబర్ 6 (విజయ క్రాంతి) : మురసు తుఫాన్( Murasu Cyclone Damage) ప్రభావంతో అశ్వారావుపేట మండలంలో కురిసిన అత్యంత భారీ వర్షాలకు గండి పడిన వెంకమ్మ చెరువును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao), అశ్వారావుపేట శాసన సభ్యులు జారే ఆదినారాయణతో కలసి శుక్రవారం పరిశీలించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బాధిత రైతులకు జరిగిన పంట నష్టాన్ని, దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట ప్రాంతంలో అత్యంత భారీ వర్షపాతం నమోదైంది అన్నారు. ఆకస్మిక వరదలతో వాగులు, వంకలు పొంగిపోర్లాయి. భారీ వరదల కారణంగా ఉద్యాన పంటలు, వరి పంటలు నీట మునిగి రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. పలు ప్రాంతాల్లో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి అన్నారు. పంట నష్టం, రహదారుల మరమ్మతులకు సంబంధించి పూర్తి వివరాలతో ఈరోజు సాయంత్రంలోగా నివేదిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.
తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని(Chief Minister Revanth Reddy) కలిసి అందజేసి తక్షణ సహాయం అందే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రతికూల వాతావరణం లోనూ పామాయిల్ సాగు రైతులకు భరోసా అన్నారు. అత్యంత భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పటికీ పామాయిల్ సాగుకు పెద్దగా నష్టం వాటిల్లకుండా పంట నిలబడటం విశేషమని మంత్రి పేర్కొన్నారు. అతివృష్టి, అనావృష్టి వంటి అసమతుల్య వాతావరణ పరిస్థితులు తరచూ ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో పామాయిల్ సాగు రైతాంగానికి ఒక వరంగా మారుతోందని ఈ పరిస్థితులు మరోసారి నిరూపించాయని మంత్రి తుమ్మల అన్నారు రైతులకు అండగా నిలుస్తూ, పంట నష్టం అంచనా, రహదారుల పునరుద్ధరణ, దెబ్బతిన్న చెరువుల మరమ్మతుల పై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. మంత్రి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఉన్నారు.