పాల పేరుతో విషం.. కల్తీ దందా గుట్టురట్టు!
రంగారెడ్డి జిల్లాలో కల్తీ పాల తయారీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో అక్రమంగా కల్తీ పాలు తయారు చేస్తున్న కేంద్రంపై మహేశ్వరం ఎస్ఓటీ (SOT Police Raid) పోలీసులు దాడులు నిర్వహించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ (Hydrogen Peroxide), ధోల్పూర్ పాలపొడి (Dholpur Milk Powder) ఉపయోగించి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ పాలను హైదరాబాద్లోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ వ్యవహారానికి సంబంధించి పాల వ్యాపారి అండే శ్రీశైలంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో 100 లీటర్ల కల్తీ పాలు, ఒక లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్, ఒక్కో కిలో బరువున్న 35 ధోల్పూర్ పాలపొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కల్తీ పాలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు సహా రోజూ పాలు వినియోగించే వారిలో ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. నిందితుడిపై కేసు నమోదు చేసి, కల్తీ పాల సరఫరా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. కల్తీ పాల సరఫరా (Adulterated Milk Supply) వ్యవహారంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.