నవంబర్ మిస్.. డిసెంబర్‌లోనైనా వస్తుందా?

06-11-2026 | 01:02pm

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక వార్ డ్రామా (War Drama) 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' (Maatrubhumi: May War Rest In Peace) విడుదలపై మరోసారి సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తొలుత ఏప్రిల్ 17న విడుదల చేయాలని భావించినప్పటికీ, అనివార్య కారణాలతో వాయిదా పడింది.

తాజాగా సెన్సార్ ప్రక్రియలో జాప్యం సినిమాకు మరో అడ్డంకిగా మారింది. నవంబర్ 13న విడుదల సాధ్యం కాకపోవడంతో నవంబర్ 20 తేదీని చిత్రబృందం పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పూర్తి నిడివి చిత్రానికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ (Censor Certificate) ఇంకా రావాల్సి ఉండటంతో అధికారిక విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. నవంబర్ 4న సినిమా ట్రైలర్‌కు U/A 16+ సర్టిఫికెట్ లభించింది.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గల్వాన్ ఘర్షణ సమయంలో 16వ బీహార్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు పాత్రలో కనిపించనున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆయనకు మరణానంతరం మహావీర చక్ర పురస్కారం లభించింది. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిత్రంగద సింగ్, ముఖేష్ రిషి, అంకుర్ భాటియా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వరుసగా విడుదల తేదీలు మారుతుండటంతో సల్మాన్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. మరోవైపు సినిమా ట్రైలర్‌పై ఆసక్తి పెరుగుతోంది. అసలు 'మాతృభూమి' డిసెంబర్‌లోనైనా థియేటర్లలోకి వస్తుందా? లేక మరోసారి వాయిదా పడుతుందా? అన్నది బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు..

మరిన్ని వార్తలు