రణబాలి మా కెరీర్‌లో గర్వపడే సినిమా

17-10-2026 | 05:20am

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి(Ranabali)’. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా మూవీటీమ్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “మేము నిన్న సాయంత్రమే సినిమా చూశాం.

ఇది ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన బెస్ట్ ఫిలిం అని చెప్పగలను. మా కెరీర్‌లో గర్వపడే సినిమా అవుతుంది. ఇది నా 14వ సినిమా. మనం ఒక ముప్పు సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక సినిమా గురించి, అందులోని పర్‌ఫార్మెన్స్ గురించి, ఆ సినిమా ప్రభావం గురించి మాట్లాడుకుంటారు. అలాంటి చిత్రమే రణబాలి. ఈ సినిమా పెద్ద విజయం సాధించబోతోంది. ఎందుకంటే మన మీడియా మిత్రులే ఈ సినిమాను తమ భుజాలపై పెట్టుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సినిమా ఎంత దూరం వెళ్తుందో నాకు తెలుసు.

ఈ సినిమా చేస్తున్నప్పుడే పెద్ద హిట్ కొట్టాలి, పెద్ద నెంబర్స్ క్రియేట్ చేయాలని అనుకోలేదు. మన వాళ్లకు చూపించడం చాలా ముఖ్యమని భావించి చేశాం. నా ఫిల్మోగ్రఫీ, తెలుగు సినిమా ఫిల్మోగ్రఫీలో రణబాలి ఒక ముఖ్యమైన చిత్రంగా మిగిలిపోతుంది. డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో ఒక క్యూట్ రోమ్ కామ్ మూవీ చేస్తున్నా. ఆయన అలాంటి స్క్రిప్ట్ తీసుకొచ్చారు కాబట్టి చేయగలుగుతున్నా. ఇప్పుడు నేను చేస్తున్న ప్రతి సినిమాను బాగా ఇష్టపడే చేస్తున్నా. ఈ చిత్రాన్ని హిందీలోనూ తీసుకురావాలని అడుగుతున్నారు. అలాగే తమిళంలోనూ రిలీజ్ చేస్తాం.

మేము టార్గెట్ చేసింది మాత్రం తెలుగులోనే. ఒక్కో హీరో తనకు నచ్చిన కథను తెరపైకి తెస్తుంటారు, అయితే కొన్ని కారణాల వల్ల సినిమా, దాని చుట్టూ ఉన్న బిజినెస్ ఒక పరుగుపందెం అవుతోంది” అన్నారు. హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ.. “నేను నటించిన సినిమాలను కూడా ఒక ప్రేక్షకురాలిగా చూస్తుంటా. ఈ సినిమా బ్రిటీష్ పాలన, మన స్వాతంత్య్ర పోరాట అంశాలతో చేయలేదు. ఆకలి, జీవనపోరాటం, సంఘర్షణ, ప్రేమ వంటి అంశాలతో తెరకెక్కింది. తన వారి కోసం నిలబడిన ఒక గొప్ప వ్యక్తి కథతో తెరకెక్కింది.

మనం జీవితంలో ఏదైనా సంపాదించాలంటే, సాధించాలంటే పోరాడాలి. అదే రణబాలి. మన కోసం మనం పోరాడాలి అనే స్ఫూర్తిని ఈ సినిమా కలిగిస్తుంది. నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. జయమ్మ, రణబాలి పాత్రలను మలచిన తీరు ఆకట్టుకుంది. అదంతా మా దర్శకుడి క్రెడిట్. నేను సీన్ యాక్ట్ చేసేప్పుడు మానిటర్‌లో ఔట్‌పుట్ చూడను, డైరెక్టర్ ఓకే అంటే ఓకే. స్క్రీన్ మీద సినిమాను ఒక ప్రేక్షకురాలిగా చూస్తా. రణబాలిలో మా సీన్స్ చూస్తుంటే సర్‌ప్రైజ్ అయ్యా. ఒక దర్శకుడు ఏదైనా ప్రత్యేకంగా రాసినప్పుడు అది పర్‌ఫార్మ్ చేసినప్పుడు యాక్టర్స్‌గా గర్వపడుతుంటాం. ఇది కుటుంబ ప్రేక్షకులు అందరూ చూడాల్సిన సినిమా” అని చెప్పారు.

డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ మాట్లాడుతూ.. “మేము సినిమా తీసిన ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఆదరిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు థ్యాంక్స్. మార్నింగ్ సోషల్ మీడియాలో ఏవేవో వచ్చాయి గానీ తెలుగు మీడియా సినిమా చూసినప్పటి నుంచి మంచి పాజిటివ్ టాక్ వింటూ వచ్చాం” అని తెలిపారు. నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. “ఈ సినిమా విజయ్ కెరీర్‌లో హ్యూజ్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం. ఇలాంటి మంచి మూవీని మా బ్యానర్ కు ఇచ్చినందుకు డైరెక్టర్ రాహుల్‌కు థ్యాంక్స్‌” అన్నారు. ‘ఒక పెద్ద నెంబర్‌ను బాక్సాఫీస్ వద్ద రణబాలి క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాం’ అని నిర్మాత రవిశంకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్, కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని పాల్గొన్నారు. 


మరిన్ని వార్తలు