ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
వెంకటాపూర్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(MLC elections) నేపథ్యంలో మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించగా, ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పైడాకుల మల్లేష్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పట్టభద్రులను గుర్తించి వారి ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిరుద్యోగుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలపై పట్టభద్రులకు అవగాహన కల్పించాలని కోరారు.
గతంలో పట్టభద్రుల ఓట్లతో గెలిచిన నాయకులు నిరుద్యోగుల సమస్యలు, ఉపాధి అవకాశాలపై తగినంతగా దృష్టి సారించలేదని ఆయన విమర్శించారు. పట్టభద్రుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బలరాం, మాజీ ఎంపీ సీతారాం నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జవహర్ లాల్, సీనియర్ నాయకులు యాదగిరి, దేవేందర్, వినోద్, రాజ్ కుమార్, శ్రీధర్, రాకేష్, మహేష్, గిరిబాబు, కృష్ణమూర్తి, కొమరయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.