ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావివ్వొద్దు
జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో( Praja Vani petitions) అర్జీదారులు సమర్పించిన దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి తావివ్వకుండా సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. సోమవారం ములుగు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్, ఎం. సంపత్రావు, జిల్లా రెవెన్యూ అధికారి రవికుమార్ లతో కలిసి ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులను స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 30 దరఖాస్తులు వచ్చాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి, పరిష్కార ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా, ప్రజలకు జవాబుదారీ తనంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.